13/06/2026
Sunday Washing Clothes Law

Sunday Washing Clothes Law

ఆదివారం వచ్చిందంటే చాలు సామాన్యుడి నుండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వరకు అందరికీ గుర్తొచ్చే మొదటి పని ‘బట్టలు ఉతకడం’. వారం రోజుల మురికి బట్టలన్నీ వాషింగ్ మెషీన్లలో వేసి ఇల్లు సర్దుకోవడానికే ఈ వీకెండ్‌ను కేటాయిస్తుంటారు. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆదివారం పూట వాషింగ్ మెషీన్ ఆన్ చేస్తే భారీ జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా.. ఐరోపా (యూరప్) లోని కొన్ని ధనిక దేశాలలో ఈ విచిత్ర చట్టాలు ఇప్పటికీ పక్కాగా అమలవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో ఆదివారాన్ని అధికారికంగా ‘విశ్రాంతి దినం’ (రెస్ట్ డే) గా పరిగణిస్తారు. ఇరుగుపొరుగు వారికి ఎలాంటి శబ్ద కాలుష్యం కలిగించకూడదనేది ఇక్కడి ప్రధాన నియమం.

జరిమానా నుండి జైలు వరకు … స్విస్ కఠిన నిబంధనలు
స్విట్జర్లాండ్‌లోని మెజారిటీ అపార్ట్‌మెంట్లలో ఉమ్మడి లాండ్రీ రూమ్‌లు ఉంటాయి. అక్కడి హౌసింగ్ రూల్స్ ప్రకారం ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో వీటిని వాడటం చట్టవిరుద్ధం. బట్టలు ఉతకడమే కాదు.. గార్డెన్ క్లీన్ చేయడం (లాన్ మూవింగ్), గోడలకు డ్రిల్లింగ్ చేయడం లాంటి శబ్దాలు వచ్చే ఏ పనీ చేయకూడదు. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మొదట పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పదే పదే తప్పు చేస్తే భారీ జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష తప్పదు. ఆదివారాల్లో బాల్కనీల్లో లేదా ఇంటి బయట బట్టలు ఆరవేయడాన్ని కూడా అక్కడ నిషేధించారు. అలా బట్టలు వేలాడదీస్తే ఆ ప్రాంతం యొక్క సహజ అందం దెబ్బతింటుందని స్విస్ ప్రజలు భావిస్తారు.

జర్మనీలో కూడా అదే రూల్.. లక్షల్లో జరిమానా!
స్విట్జర్లాండ్ తరహాలోనే జర్మనీలో కూడా ఆదివారం ప్రశాంతతకు భంగం కలిగిస్తే చట్టం ఊరుకోదు. జర్మన్ చట్టాల ప్రకారం ఆదివారాల్లో పెద్దగా మ్యూజిక్ వినడం, టీవీ సౌండ్ పెంచడం, ఇంట్లో ఫర్నిచర్ మార్చడం లాంటివి కూడా నిషేధమే. జర్మనీలో తీవ్రతను బట్టి 50 యూరోల నుంచి 2500 యూరోల వరకు అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 4500 నుంచి 2.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ప్రజలు తమ కుటుంబాలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా గడిపే హక్కును కల్పించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి, మన దేశంలో ఆదివారం పూట వాషింగ్ మెషీన్ల శబ్దాలతో ఇల్లు మార్మోగిపోతుంటే.. అక్కడ మాత్రం నిశ్శబ్దమే ఒక చట్టం! మనదగ్గర కూడా సెలవురోజు ఇలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది కదా. ఇళ్లు ప్రశాంతంగా ఉంటుంది.

Also Read  మనసున్న బిచ్చగాడు… సీఎం నిధికి భారీగా విరాళం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *