15/06/2026
Beggar Donates Lakhs to CM Relief Fund in Tamil Nadu Inspires Many

Beggar Donates Lakhs to CM Relief Fund in Tamil Nadu Inspires Many

కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తున్నా… చేతికి వచ్చిన డబ్బును తనకోసం కాకుండా సమాజం కోసం ఖర్చు చేస్తున్నాడు ఓ వృద్ధుడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని పాఠశాలలు, ఆశ్రమాలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన పూల్ పాండియన్. ప్రస్తుతం ఆయన కథ సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళానికి చెందిన 75 ఏళ్ల పూల్ పాండియన్ జీవితం ఒకప్పుడు సాధారణ కుటుంబంలానే సాగింది. ముంబైలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం గడిపాడు. పిల్లల పెళ్లిళ్లు చేసిన తర్వాత భార్య మృతిచెందడంతో ఒంటరయ్యాడు. బంధువుల ఆదరణ కూడా లేకపోవడంతో 2019లో తమిళనాడుకు తిరిగి వచ్చి సంచార జీవితం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి భిక్షాటనే అతని జీవనాధారంగా మారింది.

అయితే, పాండియన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది అతని మనసు. రోజూ భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులో తనకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటాడు. కొంత మొత్తం కూడగట్టిన తర్వాత ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తాడు. ముఖ్యంగా సీఎం సహాయ నిధికి పలుమార్లు నగదు అందించాడు. ఇటీవల మే 18, 25 తేదీల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు.

కొవిడ్ సమయంలో మదురైలో చిక్కుకుపోయిన పాండియన్ అప్పుడే రూ.50 వేల విరాళం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు రూ.10 వేల చొప్పున మదురై కలెక్టర్‌కు విరాళాలు అందించాడు. పాఠశాలలు, అనాథాశ్రమాలకు కూడా సహాయం చేస్తూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.

“డబ్బు సంపాదించడం గొప్ప కాదు… అవసరమైన చోట ఉపయోగపడటం గొప్ప” అని తన జీవితం ద్వారా చూపిస్తున్న పూల్ పాండియన్ నిజంగా మనసున్న మనిషిగా నిలిచిపోయాడు.

Also Read  పచ్చని కోనసీమలో అగ్గిరవ్వలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *