అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిపోవడంతో పాటు, ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం భీకర దాడులు జరపడం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేసింది. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 80 డాలర్ల సమీపానికి చేరుకుంది. సాధారణంగా ముడిచమురు ధరలు పెరిగినప్పుడు ఇన్వెస్టర్ల ఫోకస్ మారడంతో, బంగారం తన ఆకర్షణను కోల్పోయి ధరలు పడిపోవడం ఇక్కడ గమనార్హం.
మూడు రోజుల్లో రూ. 3,300 పతనం
ఈ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం దేశీయంగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లపై బలంగా పడింది. కేవలం గత 3 రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ. 3,300 మేర భారీ తగ్గింపు నమోదైంది. గురువారం ఉదయం మార్కెట్ వివరాల ప్రకారం..22 క్యారెట్ల ఆభరణాల బంగారం నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే రూ. 1,950 తగ్గి, ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,31,200 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బస్తీ మే సవాల్ అన్నట్లుగా ఏకంగా రూ. 2,130 క్షీణించి, ప్రస్తుతం తులం ధర రూ. 1,43,130 పలుకుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా ఔన్సుకు 4120 డాలర్ల నుండి ఒక్కసారిగా 4070 డాలర్లకు పడిపోవడం ఈ పతనానికి ప్రధాన కారణం. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ. 95.55 వద్ద స్థిరంగా ఉంది.
వెండి అదే బాట … కేజీపై రూ. 5,000 డౌన్
బంగారంతో పోటీ పడుతూ గతంలో భారీగా పెరిగిన వెండి ధరలు కూడా ఇప్పుడు పతనం వైపు పరుగులు తీస్తున్నాయి. కేవలం ఒకే రోజులో కేజీ వెండిపై రూ. 5,000 భారీగా తగ్గి, ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 2.45 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. మొన్నటికి మొన్న జూలై 6న వెండి ఏకంగా రూ. 10,000 తగ్గడం గమనార్హం. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో, సామాన్య వినియోగదారులకు ఈ ధరల తగ్గుదల ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.