అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ మరికొద్ది గంటల్లో, అంటే జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్ ఎక్కడికి వెళ్లినా ఒకే విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు.. అదే ఈ సినిమా చివరి 20 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్. ఆ ముగింపులో వచ్చే ఒక భారీ ట్విస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆశ్చర్యపరుస్తుందని, అదే ఈ సినిమాకు అసలైన ప్రాణమని అఖిల్ నమ్మకంగా చెబుతున్నారు.
ఆ చివరి 20 నిమిషాలే కీలకం
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, నటుడు శివాజీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ అఖిల్ క్లైమాక్స్ గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కథ ముగింపు దశకు చేరుకున్నప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లు థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఒక మంచి అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం భావిస్తోంది.
సాధారణంగా సినిమాలకు సెకండాఫ్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్ అయితే ఆ బొమ్మ రేంజే మారిపోతుంది. ఇప్పుడు అఖిల్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. గత చిత్రాల కంటే భిన్నంగా ఈసారి భారీ హైప్‌తో వస్తున్న ‘లెనిన్’.. అఖిల్ కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతుందో చూడాలి. ఒక గట్టి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల కళ్లు ఇప్పుడు పూర్తిగా ఈ సినిమా ఫలితంపైనే ఉన్నాయి.