ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఎంతో కీలకం. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి భవిష్యత్తు కోసం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మందికి పీఎఫ్ అకౌంట్లో పేరు తప్పుగా ఉండటం, పుట్టిన తేదీ మారిపోవడం, కంపెనీ వివరాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి చిన్న తప్పులే భవిష్యత్తులో పీఎఫ్ క్లెయిమ్, పెన్షన్, ఉద్యోగ మార్పు సమయంలో పెద్ద ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. ఇంట్లో నుంచే కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్లైన్ ద్వారా వివరాలు సరిచేసుకునే సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ అందిస్తోంది.
గతంలో పీఎఫ్ ఖాతాలో మార్పులు చేయాలంటే కంపెనీ నుంచి జాయింట్ డిక్లరేషన్ తీసుకుని ఈపీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం యూఏఎన్ (UAN) నంబర్, పాస్వర్డ్ ఉంటే చాలు. EPFO అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి సులభంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, జెండర్, తండ్రి లేదా భర్త పేరు, వివాహ స్థితి, జాతీయత, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం వదిలిన తేదీ వంటి అనేక వివరాలను మార్చుకునే అవకాశం ఉంది.
ముందుగా EPFO పోర్టల్‌లోకి వెళ్లి UAN ద్వారా లాగిన్ కావాలి. తర్వాత ‘Manage’ సెక్షన్లో ఉన్న ‘Joint Declaration’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ వివరాలను ఎంపిక చేయాలి. అక్కడ కనిపించే ఫారమ్‌లో మార్చాల్సిన వివరాలను నమోదు చేసి సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, 10వ తరగతి మెమో, మ్యారేజ్ సర్టిఫికెట్ వంటి పత్రాలు అవసరం అవుతాయి.
అప్లికేషన్ సమర్పించిన తర్వాత మొదట కంపెనీ అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదిస్తారు. అనంతరం ఈపీఎఫ్ కార్యాలయం వెరిఫికేషన్ పూర్తి చేసి సాధారణంగా 15 రోజుల్లోపు కొత్త వివరాలను అప్డేట్ చేస్తుంది. పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాట్లను కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే సరిచేసుకోవడం ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది.