సంతానాన్ని ప్రసాదించే రౌలపల్లి అష్టభుజి భవానీ ఆలయం

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తిని పూజించినా, దర్శించినా జన్మధన్యమౌతుంది. అమ్మవారి స్వరూపాల్లో కనకదుర్గ అమ్మవారు కూడా ఒకరు. కనకదుర్గను ఆరాధించినవారిని కష్టాల నుంచి దూరం చేస్తుందని, సంతానభాగ్యం కలిగిస్తుందని, ఆర్థిక కష్టాలనుంచి బయటపడేలా చేస్తుందని నమ్ముతారు. అమ్మవారిని ముఖ్యంగా దుర్గానవరాత్రుల సమయంలో విశేషంగా పూజిస్తారు. దుర్గాదేవికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. అందులో ఒకటి ఒడిశా రాష్ట్రంలోని గంజా జిల్లా రౌలపల్లి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ అమ్మవారికి నిర్మించిన ఆలయం అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది కూడా. ఇక్కడి అమ్మవారిని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి ఆలయాన్ని స్థానికులు శక్తిపీఠంగా ఆరాధిస్తారు. అమ్మవారిని ఆరాధించినవారు ఎందరో ప్రత్యేకించి అమ్మ మహిమలను స్వయంగా అనుభవించినట్టుగా కూడా చెబుతున్నారు.

దుర్గాదేవి అష్టభుజ దేవతగా మనకు దర్శనం ఇస్తారు. ఆరు చేతులతో ఐదు రకాలైన ఆయుధాలతోనూ, ఆశీర్వాద హస్తంతోనూ అమ్మ దర్శనం ఇస్తుంది. కనకదుర్గాదేవి పార్వతీదేవి రూపంగానూ, శతృసంహారకురాలిగాను భక్తులకు దర్శనం ఇస్తుంది. భక్తుల మనోభీష్టాలను తీర్చే మహాశక్తిగా చెబుతారు. చుట్టు పచ్చని ప్రకృతి మధ్య పవిత్రమైన కొండపై అమ్మవారి ఆలయం ఉండటం విశేషం. ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తిని చాటుకుంటూ కొండ ఎక్కి అమ్మను దర్శించుకుంటారు. కొండ ఎత్తుగా ఉన్నప్పటికీ అమ్మవారి నామం జపిస్తూ ముందుకు సాగితే ఎటువంటి అలసట, కాళ్లు నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం. చుట్టుపక్కల వాళ్లు అమ్మను ఆదిపరాశక్తిగా ఆరాధిస్తే, రౌలపల్లి గ్రామ ప్రజలు అమ్మను తమ ఇంటి దేవతగా, తమ గ్రామదేవతగా ఆరాధిస్తారు. గ్రామంలో ఏ కుటుంబంలో శుభకార్యం జరిగినా ముందుగా ఆలయానికి వెళ్లి అమ్మకు తెలియజేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

అమ్మను తన దేవతగా ఆరాధిస్తే ఎన్నో మహిమలను చూపుతుంది. దీనికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. సంతానం కోసం ఇక్కడ 9 శుక్రవారాలు దీపారాధన చేయడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు పరీక్షల్లో వెనకబడిన విద్యార్థులు అమ్మవారికి మంగళహారతిని మొక్కుగా చెల్లించుకుంటే తప్పకుండా ఆ విద్యార్థులు విద్యలో రాణిస్తారని చెబుతారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కూడా అమ్మవారిని నిత్యం ఆరాధించి, ధ్యానించి మొక్కులు చెల్లించుకుంటే వ్యాపారంలో చిక్కులు తొలగిపోయి లాభాలు ఆర్జిస్తారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా రౌలపల్లి గ్రామస్తులు పరుగుపరుగున వెళ్లి అమ్మకు తెలియజేస్తారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు.

అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో జరిగే పూజలు, జాతరలు కూడా ప్రత్యేకమైనవే. చైత్రమాసంలో జరిగే జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి ప్రత్యేకించి పల్లకీ సేవ, ఆషాఢంలో జరిగే బోనాల జాతరలు, కళ్యాణోత్సవం వంటి కార్యక్రమాలు ప్రత్యేకమైనవి. ఈ జాతరలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం, ఆదివారాల్లో అమ్మను దర్శించుకునేందుకు గంజాం జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. దుర్గానవరాత్రుల అత్యంత ప్రత్యేకమైనవి. భక్తులతో పాటు సాధువులు, సన్యాసులు, తాంత్రికవిద్యను అభ్యసించేవారు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి అమ్మను దర్శించుకొని వెళ్తుంటారు. మహిళలు తమ మాంగళ్యం నిండునూరేళ్లు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ కుంకుమార్చనను విశేషంగా చేస్తారు. శుక్రవారం రోజున ఈ పూజ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా స్నపన పూజ, పుష్పార్చన, నైవేద్యం, హారతి కూడా విశేషంగా నిర్వహిస్తారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో అమ్మవారికి పానకం, బెల్లం కొబ్బరి, పండ్లు, పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

ఈ ఆలయం వివిధ రకాలైన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రౌలపల్లి గ్రామానికి సమీపంలో బెరహంపూర్‌ పట్టణం ఉంది. ఈ పట్టణంలోనే రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. ఇక్కడి నుంచి ఆటోలు, టాక్సీలు రౌలపల్లి వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. రౌలపల్లి నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్‌ విమానాశ్రయం ఉంది. భువనేశ్వర్‌ నుంచి బెరహంపూర్‌కు బస్సు రైలు సౌకర్యాలు ఉన్నాయి. రౌలపల్లి నుంచి ఆలయం ఉన్న కొండప్రాంతానికి చేరుకునే క్రమంలో ప్రకృతి సోయగాలు మన మనసుల్ని ఆహ్లాదపరుస్తాయి. జలపాతాలు, చిన్ని చిన్ని కొండలు ఆకట్టుకుంటాయి. ఒడిశా వెళ్లినవారు తప్పకుండా అష్టభుజి దుర్గాదేవిని దర్శించుకోవడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *