నీరు, నిప్పు, గాలిని అదుపు చేయడం కష్టం. ఒక్కసారి దావానంలా వ్యాపించడం మొదలుపెడితే ఇల్లు, ఊళ్లు అన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. మనుషులు కట్టిన ఇళ్లను నేలమట్టం చేయవచ్చేమోగాని, భగవంతుడు నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేయగలదా? అసాధ్యమే. భగవంతుడు తాను ఉన్నాడు అని చెప్పడానికి ఇలాంటివే నిదర్శనంగా ఉంటాయి. ఈ కలియుగంలోనూ అద్భుతాలను మనముందు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం నమ్మి తీరాలి. దానికో ఉదాహరణే తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం.
ఈ ఆలయం చుట్టూ ఎన్నో కథలు, కథనాలు, రహస్యాలు దాగున్నాయి. అటువంటి వాటిల్లో ప్రళయ రహస్యం కూడా ఒకటి. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించి గర్బగుడిలో ఉన్న స్వామివారిని ఆ వరద తాకితే ప్రళయం వస్తుందని ఆలయ శాసనంలో ఉంది. ఆలయ శాసనం ఉన్నది అంటే అది భగవంతుని శాసనమనే చెప్పాలి. జరిగి తీరుతుంది. ఇటీవలే భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేశాయి. తిరువనంతపురాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరద నీరు అనంత పద్మనాభుని ఆలయాన్ని కూడా తాకింది. ఎంతగా అంటే అర్చక స్వాములు ఆలయంలోకి అడుగుపెట్టలేనంతగా వరద ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది.
దీంతో అర్చక స్వాములు కంగారు పడ్డారు. వారి భయం దేనిగురించో తెలుసా… వరద నీరు స్వామివారిని తాకిందేమో అని. ఒకవేళ అలా తాకితే జరిగే నష్టం ఎవరూ ఊహించలేరు. ఎలాంటి విపత్తులు ఎదురైనా స్వామివారి నిత్యకైంకర్య సేవలు జరిగి తీరాలి. అలా జరగలేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ విశేషమేమంటే స్వామివారిని నిత్యం ఎందరో దేవతలు పూజిస్తూ ఉంటారు. అర్చక స్వాముల పూజ కంటే ముందే దేవతలు స్వామిని అర్చిస్తారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కూడా ఒక నిదర్శనమే.
మూడు రోజులపాటు భారీ వర్షాల కారణంగా ఆలయాన్ని తెరవలేకపోయారు. వరద కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లి గర్బగుడిని తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. స్వామివారి గర్భగుడిలోకి నీరు ప్రవేశించలేదు. ఎక్కడా తేమ కూడా లేదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన విధంగా పొడిగా ఉంది. అంతేకాదు, మూడు రోజులపాటు ఆలయం తలుపులు తెవరకున్నా గర్భగుడిలో సుంగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండ దీపంతో స్వామివారు దర్శనం ఇచ్చారు.
అంతేకాదు, స్వామివారికి అలంకరించిన పూల మాలలు కూడా తాజాగా ఉండటం విశేషం. ఒక్క స్వామివారి గర్భాలయంలోకి మాత్రమే కాదు, ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాల్లోకి కూడా వరదనీరు ప్రవేశించలేదు. ఇది నిజంగా అద్భుతమే కదా. ఊహకు అందని అద్భుతం. ఏ సైన్స్ కు అంతుచిక్కని అద్భుతం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు… అసలు ఉన్నాడా లేడా అని ప్రశ్నించేవారికి ఈ అనంత పద్మనాభ ఆలయంలో జరిగిన ఈ సంఘటనే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఓ నిదర్శనం. అద్భుతం జరగకముందు ఎవరైనా, ఎన్నైనా ప్రశ్నించవచ్చు. అద్భుతం జరిగిన తరువాత దాని గురించి చెప్పుకోవడమే తప్పా ప్రశ్నించకూడదు. ఇలాంటి లీలలు ఈ అనంత పద్మనాభుని ఆలయంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.