తమిళనాట మహాశివునికి ఆలయాలు ఎన్ని ఉన్నాయో చెప్పక్కర్లేదు. ప్రతి శైవక్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అటువంటి వాటిల్లో ఒకటి విల్లుపురం జిల్లాలోని తరువక్కురై గ్రామంలో ఉంది. వరాహ నదీతీరాన చంద్రమౌళీశ్వరుడి పేరుతో రెండువేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిట్టుగా ప్రచారంలో ఉంది. వైష్ణవులకు 108 దివ్యదేశాలు ఎంతటి ప్రావస్త్యమో, శైవులకు 275 ఆలయాలు కూడా అంతే ప్రాశస్త్యమైనవని ప్రీతితి. వీటినే పాడల్ పెట్ర స్థలం అని అంటారు. అలాంటి వాటిల్లో తరువక్కురై కూడా ఒకటి. చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని ఆదిత్య చోళరాజు 9వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెబుతారు. ఇక్కడి ఆలయంలో రాజగోపురం మొత్తం ఏడు అంతస్తులతో నిర్మితమై ఉంటుంది. ఈ ఆలయంలో ఏ వైపు చూసిన ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ శివలింగంలో మూడు మూర్తుల రూపంలో దర్శనం ఇస్తుంది. తూర్పు ముఖాన్ని తత్పురుష లింగమని, ఉత్తరం వైపున్న ముఖాన్ని వామదేవ లింగమని, దక్షిణంవైపున్న ముఖాన్ని అఘోరలింగమని పిలుస్తారు. ఈ ఆలయంలో చంద్రమౌళీర్వరుడితో పాటు మరో రెండు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఉపాలయాల్లో మొదటిది విష్ణుమూర్తి ఆలయం. ఆయన్నే ప్రయోగ చక్రేశ్వరుడిగా పిలుస్తారు. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
పూర్వం వక్రాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పట్టి పీడించసాగాడు. వాడి బాధలు భరించలేక దేవతలు మహా శివుడిని ప్రార్థించగా.. ఆయన తన చేతులతో వక్రాసురుడిని హతమార్చలేనని, అతను తనకు ప్రియభక్తుడని, ఈ పనికి పూనుకోవలసింది శ్రీమహావిష్ణువేనని చెప్పి ఆయన్ను కోరతాడు. వంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వక్రాసురుడిని వధిస్తాడు. ఇక్కడ శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సంధిస్తున్నట్టుగా కనిపిస్తాడు. అయితే, వక్రాసురిడి వధ అంత సులువుగా జరగలేదు. వక్రాసురుడి శిరసును ఖండించినపుడు నేలపై పడిన రక్తపు బిందువుల నుంచి కొన్ని వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. ఆవిధంగా వక్రాసురుడి రాక్షస సమూహం పెరిగిపోవడంతో శ్రీమహావిష్ణువు విసిగెత్తిపోయాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో మహాశివుడి ఆదేశాల మేరకు కాళికాదేవి రంగంలోకి దిగి వక్రాసురుడి రక్త బిందువులు నేలపై పడకుండా తన నాలుకను అడ్డుగా పెట్టింది. వక్రాసురుడి సోదరి దున్ముఖిని కాళికాదేవి అంతం చేసింది. ఈ కారణంగానే కాళికాదేవిని వక్రకాళి పేరుతో పూజిస్తారు. కాళికాదేవి ఉగ్రరూపంలో ఉంటుంది. ఆమెను శాంతింపజేయడం అంత సులభం కాదు. అమ్మవారిని శాంతిపజేయడం కోసం ఆదిశంకరాచార్యులవారు తరువక్కురై చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు.
తరువక్కురై ఆలయంలో మహాశివునితో పాటు విష్ణుమూర్తి ప్రయోగచక్ర, కాళికాదేవి వక్రకాళి ఉపాలయాలున్నాయి. చంద్రమౌళీశ్వరుని దర్శించుకున్న భక్తులు విష్ణుమూర్తి, కాళికాదేవి ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో శివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. గ్రామం చిన్నదే అయినా ప్రత్యేక ఉత్సవాల సమయంలో దారులన్నీ తరువక్కురై వైపే ఉంటాయి. ఈ ఆలయంలోని కాళీమాత ఆశిస్సులు తీసుకొని పనులు మొదలుపెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఎలాంటి ఆపద ఎదురైనా బయటపడతారని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో చంద్రమౌళీశ్వరుడిని, వక్రకాళిని దర్శించుకుంటారు.