తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా గుర్తింపు పొందిన రామచంద్ర ప్రస్తుతం పక్షవాతం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఆయనను పరామర్శించడానికి ముందుకొచ్చారు.
ఈ రోజు హైదరాబాద్‌లోని రామచంద్ర నివాసానికి వెళ్లిన మంచు మనోజ్, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. రామచంద్రతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన మనోజ్, ఆయన చికిత్స, కోలుకునే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
“రామచంద్ర అనారోగ్య పరిస్థితి గురించి ఆయన సోదరుడి ద్వారా తెలిసింది. వెంటనే ఆయనను కలవాలని భావించాను. రామచంద్ర త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మనోజ్ తెలిపారు.
రామచంద్ర వెంకీ సినిమాలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అనారోగ్యం వార్త విన్న అభిమానులు, సహచరులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.