సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి శుభదినాల్లో వ్యక్తులు విరాళం అందజేసి అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రలకు పంపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన, “సామాజిక సేవలో భాగంగా ఆర్టీసీ తీసుకొచ్చిన యాత్రాదానం ఒక వరం” అన్నారు. కార్పొరేట్ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, “భారతదేశంలోనే మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఆధ్యాత్మికాన్నీ, సాంస్కృతిక విలువల పరిరక్షణనూ పెంచుతుంది” అన్నారు. యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలు సిద్ధం చేశామని తెలిపారు.
యాత్రాదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనర్ చెరో లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ నిధితో వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు విహారయాత్రలు ఏర్పాటు చేయనున్నారు.