ఒకవైపు కూటమి ప్రభుత్వం తాము తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్టయ్యాయని, అనంతపురంలో సూపర్ హిట్ పేరుతో సభను ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, కానీ, చేసిన వాటిని ప్రజల ముందు బలంగా, ప్రచారం చేయలేకపోయామని, తమ ఓటమికి ఇదికూడా ఒక కారణమని అన్నారు. తమ అభివృద్ధి గురించి తాము సవాల్ విసురుతున్నామని, కూటమి ప్రభుత్వంలోని 164 మంది ఎమ్మెల్యేలలో ఎవరైనా సరే తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
అంతేకాదు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని, తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని, అందులో 7 కాలేజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీని కోసం టెండర్లను కూడా పిలుస్తున్నారని, దీనిని తాము ఎంతమాత్రం ఉపేక్షించలేమని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటైజేషన్ చేసిన కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, టెండర్లను రద్దు చేస్తామని అన్నారు.