ప్రతీ ఒక్కరి సహకారంతోనే గంజాయిపై ఉక్కు పాదం మోపామని ఇంతవరకు విజయనగరం జిల్లా 32 వ ఎస్పీగా పని చేసి,గుంటూరు జిల్లాకు బదిలీ అయిన వకుల్ జిందల్ శనివారం అన్నారు. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ లో ఎస్పీ వకుల్ జిందల్ కు పోలీస్ శాఖ మొత్తం వీడ్కోలు పలికింది. గుంటూరు జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ వకుల్ జిందల్ కు ఘనంగా వీడ్కోలు పలికారు జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు, సివిల్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది.
సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లోను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపామని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లా ప్రజలను, అధికారులు, సిబ్బందిని విడిచి వెళ్ళడం బాధగా ఉందని జిల్లాలో 14 నెలలు పని చేసి, గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యిందని, అందరి సహకారం, సమన్వయంతో ఈ జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాల్లోను జిల్లాను అగ్రగామిగా నిలిపామన్నారు. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేసామని, గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేసామన్నారు.
జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండాఅధికారులు, సిబ్బంది చాలా సమర్ధవంతంగా, అంకిత భావంతో పని చేసారన్నారు. ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులు కూడా తమవంతు బాధ్యతలను, విఐపి డ్యూటీలు, ఆర్.ఓ.పి.చెకింగు, ఎ.ఎస్.చెక్, పి.ఎస్.ఓ. డ్యూటీలు, గార్డ్ డ్యూటీలు సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని, సూత్రదారులను కనిపెట్టి, వారిపై పి.డి.యాక్టు, పిట్ ఎన్.డి.పి.ఎస్. ప్రయోగించామన్నారు. బాలలపై జరిగే అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై నమోదైన కేసుల్లో నిందితులకు ఆరు మాసాల్లోనే శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. సైబరు నేరాల్లో నిందితులను అరెస్టు చేసి, నగదు రికవరీ చేసి, బాధితులకు అందించామన్నారు.
సిసి కెమెరాలను జిల్లా వ్యాప్తంగా పెట్టించి, నేరాలు జరగకుండా నియంత్రించడంతోపాటు, పలు నేరాలను చేధించామన్నారు. తనకు అందించిన సహకారాన్నే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి కూడా అందించాలని ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.అనంతరం, ఎస్పీ వకుల్ జిందల్ ను దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ ను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎక్కించి, అధికారులు, సిబ్బంది తమ స్వహస్తాలతో వాహనాన్ని లాగి, పూలను జల్లి, ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు’ పలికారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి. సౌమ్యలత, జి. నాగేశ్వరరావు, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పలువురు రిజర్వు ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఆర్ఎస్ఐలు, ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.