ఆశ్చర్యపరిచే ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 21, 2025న కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన కామ్ ఎయిర్ విమానం RQ-4401 వెనుక భాగంలోని సెంట్రల్ ల్యాండింగ్ గియర్‌లో 13 ఏళ్ల అఫ్గాన్ బాలుడు దాక్కున్నాడు.
సాధారణంగా విమానాల ల్యాండింగ్ గియర్ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. గాలి ఒత్తిడి, తక్కువ ఆక్సిజన్, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు వల్ల అక్కడ జీవించడం చాలా కష్టమని విమాన నిపుణులు చెబుతారు. అయినా, ఆ బాలుడు ఎలా బ్రతికి సురక్షితంగా ఢిల్లీకి చేరాడో ఒక మిస్టరీగానే మిగిలింది.
ఉదయం 11:10 గంటల సమయంలో ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై బాలుడు తిరుగుతుండగా CISF సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ఆ బాలుడు కుందూజ్ ప్రావిన్స్‌కు చెందినవాడని, తన అసలు లక్ష్యం ఇరాన్ చేరుకోవడమేనని చెప్పాడు. అయితే, కాబూల్ హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందిని తప్పించుకుని పొరపాటున ఢిల్లీకి వెళ్లే విమానంలో ఎక్కాడని వెల్లడించాడు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు అతనిని కౌన్సెలింగ్ చేసి, మానసికంగా ధైర్యం చెప్పి ఆ రోజు మధ్యాహ్నం తిరిగి కాబూల్‌కు పంపించారు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి ఎలా ప్రవేశించగలిగాడు అన్నది ఒక ప్రశ్నైతే… ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ చిన్నారు బతకలేకపోతున్నారని, బలవంతంగా దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నది కొందరి వాదన.
తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట్లో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. అయితే, పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు. కానీ, ఇప్పుడు మరోసారి ఈ బాలుడి ఉదంతం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యాలు మరోసారి బయటపడ్డాయి. సాధారణ బాలుడు కాబట్టి సరిపోయింది. అదే ఏ ఉగ్రవాదో అయితే ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవడం మంచిది.