తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న పైరసీ సమస్య మళ్లీ హాట్ టాపిక్ అయింది. తాజాగా, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త సినిమాలను లీక్ చేస్తున్న వెబ్‌సైట్లపై దాడులు మరింత బలపరిచారు. సికందర్ సినిమా రిలీజ్ కాకముందే HD లో బయటికి రావడం పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించింది.
ఈ కేసులో ఫిర్యాదు చేసిన వారు ETV WIN టీమ్, వాళ్ల కంటెంట్ పైరసీ సైట్లలో కనిపించడంతో సైబర్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం iBomma, Movierulz, టెలిగ్రామ్ గ్రూపులు వంటి ప్లాట్‌ఫామ్‌లు సినిమాలను వేగంగా లీక్ చేస్తున్నాయి. హైదరాబాద్, దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ వంటి దేశాల నుండి ఈ గ్యాంగులు ఆపరేట్ అవుతున్నాయని సమాచారం.
ఇంతకుముందు జూలైలో కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఈ పైరసీ నెట్‌వర్క్ విస్తృతంగా ఎలా పనిచేస్తుందో బయటపడింది. వీళ్లు సినిమాను మొబైల్‌లో రికార్డ్ చేసి, వాటర్‌మార్క్ వేసి, ఎడిట్ చేసి, పైరసీ సైట్లలోకి అప్‌లోడ్ చేస్తున్నారు. తర్వాత వాటిని తక్కువ ధరలకు అమ్ముతున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్ ద్వారాకూడా విస్తరిస్తున్నారు.అధికారులు చెప్పారు – ఈ పైరసీ వ్యవస్థ ఓ బిజినెస్ మాదిరిగా నడుస్తుంది.
టెక్నికల్‌గా బలమైన గ్యాంగులు ఎడిటింగ్, అప్‌లోడింగ్, మనీ కలెక్షన్ అన్నీ చూసుకుంటారు. అంతే కాదు, సాటిలైట్ డిజిటల్ డ్రైవ్‌లను హ్యాక్ చేసి ఫుల్ HD ప్రింట్ ను నేరుగా రిలీజ్ చేసే స్థాయికి ఎదిగారు.సినిమా ప్రేమికులు మాత్రం థియేటర్లలో, లీగల్ OTT ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే సినిమాలను చూడాలని పోలీసులు కోరుతున్నారు. పైరసీ చేయడం నేరం మాత్రమే కాకుండా, జైలు శిక్ష, భారీ ఫైన్ కూడా ఉంటుందని గుర్తు చేశారు.త్వరలో రాబోయే భారీ సినిమాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ సైబర్ పోలీసులు పైరసీ నెట్‌వర్క్స్ పై తనిఖీలను మరింత కఠినతరం చేశారు.