దుర్గానవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన నేడు నవదుర్గా సంప్రదాయం ప్రకారం భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. అమ్మవారు సమస్తలోకాలకు అధిష్టాన దేవత. పరమశక్తి స్వరూపిణి. ఈ విశ్వాన్ని పాలించే తల్లిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. రాజరాజేశ్వరి దేవి పేరుకు తగిన విధంగా రాజసింహాసనంపై కూర్చొని, ఎరుపు వర్ణంలోని వస్త్రధారణలో, సర్వభూషణాలతో అలంకరించి ఆరాధించడం ప్రత్యేకతగా చెప్పాలి.
అమ్మవారిని ఆరాధించడం వలన ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సౌఖ్యం, ఐశ్వరం, విజయంతో పాటు జ్ఞానము లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినపుడు ధైర్యం, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత, చేపట్టిన పనుల్లో విజయం సాధించే విధంగా రాజరాజేశ్వరి అనుగ్రహిస్తుంది.
అమ్మవారి పూజా విధానం కూడా విశిష్టమైనదే. పూజా విధానంలో ముందుగా ఇంటిని శుద్ధిచేసి, దేవికి కుంకుమ, పువ్వులు, పండ్లను సమర్పిస్తారు. ఇక శ్రీసూక్తం, లలితా సహస్రనామాలు, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠిస్తారు. పూజా సమయంలో మనసులో ఏకాగ్రతను పెంచుకొని అమ్మవారిని ధ్యానించాలి. ఇక అమ్మవారి ఆరాధనలో అత్యంత ముఖ్యమైనది భక్తి వినయం. ఆత్మ సమర్పణ. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే అమ్మవారు భక్తులకు మంగళాలను ప్రసాదిస్తుందని నమ్మకం. జీవితంలో ఆనందం, శాంతి, సమృద్ధిని కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.