ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేట సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరప్రాంతంలోని సమస్యలను పలుమార్లు గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉప్పాడ తీరంలో సముద్రం నిరంతరం ఎగసిపడుతుంది. ఎప్పుడు సముద్రపు అలలు తీరాన్ని దాటి ముందుకు వస్తాయో తెలియక తీరప్రాంత ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఉప్పాడ తీరప్రాంత పరిష్కరిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం త్వరితగతిన సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. ఉప్పాడ మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పరిశ్రమలు, మత్స్యశాఖ కమీషనర్లు, ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కాకీనాడ కలెక్టర్ ఉండనున్నారు. వీరితోపాటుగా కాకినాడ కలెక్టర్ నియమించిన ఉప్పాడ తీరప్రాంత సభ్యులు కూడా ఉంటారు. తీరప్రాంతంలోని సమస్యలను కమిటీ ముందుకు తీసుకొస్తే వారు వాటిని పరిష్కరిస్తారు. కాగా, త్వరితగతిన బోర్డును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే, పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ కమిటీవరకు ఉండిపోతుందా? సమస్యలను తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ముందుకు వస్తుందా అన్నది సందేహం.