Native Async

భారత్‌తో యూకే సరికొత్త మైత్రి

UK Prime Minister Keir Starmer in India Strengthening Trade Ties with 100 Billion Dollar Vision by 2030
Spread the love

యూకే ప్రధాని కియర్‌ స్టార్మర్‌ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. అయితే, ఆయనతో పాటు 125 మంది ప్రతినిధుల బృందం కూడా రావడం విశేషం. ఇందులో వ్యాపార, విద్యా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. భారత్‌తో ట్రేడింగ్‌ విషయంలో సరికొత్త అడుగులు వేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని స్టార్మర్‌ తెలియజేశారు. ఇటీవలే రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (Comprehensive Economic and Trade Agreement) జరిగింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఈ పర్యటనను కియర్‌ స్టార్మర్‌ వినియోగించుకోనున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం యూకే నుంచి భారత్‌కు వచ్చే 99 శాతం వస్తువులపై సుంకాలు తొలగించబడతాయి. సుంకాలు లేకుండా నేరుగా భారత్‌ మార్కెట్‌లోకి యూకే వస్తువులు ప్రవేశిస్తే… ఇక్కడ వాటి ధర కూడా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒకవైపు భారత్‌ ఆర్మనిర్భర్‌ భారత్‌ పేరుతో ఉత్పత్తి రంగాన్ని గణనీయంగా పెంచుతూనే మరోవైపు భారత్‌తో చెలిమి బాటలో నడిచే దేశాలకు స్నేహహస్తం ఇస్తూ సుంకాలను తగ్గిస్తోంది. ఇక, ఈ అగ్రిమెంట్‌ తరువాత రెండు దేశాల మధ్య వాణిజ్యం 100 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Poll: మోదీ పాతికేళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం

ఈ పర్యటనలో భాగంగా కియర్‌ భారత ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విద్య, సాంకేతికత, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చించనున్నారు. భారతదేశంలో ఆధునిక సాంకేతికత, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో యూకే పెట్టుబడులు పెట్టనుంది. అదేవిధంగా విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు కూడా ప్రధాన అజెండాగా మారనున్నాయి. అయితే, భారతీయ ఉద్యోగులు, విద్యార్థుల వీసా వంటి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని, రెండు దేశాల మధ్య సహకారంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సాంకేతిక మార్పిడులు మరింత వేగవంతం అవుతాయని కియర్‌ స్టార్మర్‌ తెలియజేశారు. 200 ఏళ్లు భారత్‌ను పరిపాలించిన యూకే ఇప్పుడు భారత్‌ సహాకారం కావాలి అంటూ రావడం భారతీయులు గర్వించదగిన విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *