డాకోర్, గుజరాత్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఈ విశిష్టమైన ప్రసాద “లూట్ ఉత్సవం” శతాబ్దాల నుంచి కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న డాకోర్ శ్రీ రాంచోధ్రాజీ మహారాజ్ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆలయం వద్ద ప్రతీ ఏటా సుమారు 3000 కిలోల ప్రసాదం. ఇందులో లడ్డు, పూరణపూరి, మిఠాయి, శెనగ పిండివంటలు, నెయ్యి, పొంగల్ మొదలైన అల్పాహారాలు ఉంటాయి. హారతి అనంతరం వీటిని సమర్పిస్తారు. ఇక్కడ సమర్పించడం అంటే భక్తులకు ఇవ్వడం కాదు… 3000 కిలోల ప్రసాదాన్ని రాశిగా పోయగా దానిని భక్తులు లూటీ చేస్తారు.
ఈ “లూట్” అంటే ఇక్కడ భౌతికంగా దోచుకోవడం కాదు. భక్తులు ప్రసాదాన్ని స్వయంగా ఆలయం నుండి పరుగెత్తుతూ తీసుకోవడం ద్వారా దైవానుగ్రహం పొందినట్టు భావిస్తారు. శ్రీరాంచోధ్రాజీ మహారాజ్, అంటే భగవాన్ శ్రీకృష్ణుడి విగ్రహం ఇక్కడ వెలసి ఉండటంతో ఈ ఉత్సవాన్ని “కృష్ణ ప్రసాద”గా ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు.
కార్తీకంలో ఒక్కపూట భోజనం ఎందుకు చేయాలి?
ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు వ్యవస్థాపకులు సమీపంలోని 80 గ్రామాల నుంచి ఎంపిక చేసిన కుటుంబాలను అధికారికంగా పిలిచే సంప్రదాయం ఉంది. గ్రామ పెద్దలతో కలిసి యువకులు, మహిళలు కూడా సమిష్టిగా ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం పొందుతారు. స్వామివారికి ప్రసాదం సమర్పణ ముగిసిన వెంటనే ఆలయ పూజారులు సంకేతం ఇస్తారు. అదేవిధంగా గంటలు మోగించగానే భక్తులు “గోవిందా!” అంటూ ఆనందంతో ప్రసాదం కోసం పరుగులు తీస్తారు.
రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, వాలంటీర్ల భద్రత మధ్య ఈ లూట్ ఉత్సవం జరుగుతుంది. ప్రసాదం కిందపడినప్పటికీ ఫ్లోరింగ్ జారకుండా ఉండేందుకు ఏర్పాటు ఉంటుంది. డాకోర్ ప్రసాద లూట్ ఉత్సవం దైవికతతో గ్రామీణ ఐక్యత, భక్తి, ఆనందం సంగమంగా ఉంటుంది. ఇది తరతరాలుగా నిలిచిన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ఈ ఉత్సవం నిలుస్తుంది.