కార్తీక మాసం వచ్చింది అంటే రోజూ ఏదో ఒక శివాలయానికి వెళ్లి పూజ చేయించుకోవడం, అభిషేకం చేయించడం లేదా దర్శించుకోవడం చేస్తుంటాం. అయితే, ఈ కార్తీక మాసంలో కొన్ని శివాలయాలను తప్పనిసరిగా దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆ శివాలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలి.

ముఖ్యంగా శ్రీశైలంలోని శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అంటారు. తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని కూడా ఈ కార్తీకమాసంలో తప్పకుండా దర్శించుకోవాలి. ఈ ఆలయంలో జపం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అర్థనారీశ్వరుని రూపంలో దర్శనం ఇచ్చే యాగంటి ఉమామహేశ్వరుడిని కూడా కార్తీకమాసంలో దర్శించుకోవడం మంచిది. కృష్ణమ్మ ఒడిలో సేదతీరుతున్న సంగమేశ్వరుని దేవాలయాన్ని ఈ కార్తీకంలో దర్శించుకుంటే పాపాలు నశిస్తాయని అంటారు. అయితే, ఈ కాలంలో సంగమేశ్వర ఆలయం కృష్ణానదిలో మునిగిపోయి ఉంటుంది కాబట్టి సాధ్యం కాదు.

నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వరుని దర్శనం కూడా అత్యంత పవిత్రమైనదే. వేములవాడ రాజన్న ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వరాలయం, కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇవే కాదు, రాష్ట్రంలోని ఇంకా ఎన్నో ఖ్యాతిగాంచిన శివాలయాలు ఉన్నాయి. వాటిని కూడా వీలైతే ఈ కార్తీకమాసంలో దర్శించండి. తప్పకుండా మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి…