Native Async

రాజస్థాన్‌లో బంగారం నిల్వలు.. అధికారికంగా గుర్తించిన అధికారులు

Banswara third gold reserve Rajasthan
Spread the love

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా, గిరిజన సంస్కృతి, సహజ సంపదలతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం మరోసారి బంగారం సంపదతో వెలుగులోకి వచ్చింది. గటోల్ మండలంలో ఉన్న కన్కరియా గ్రామ పరిధిలో మూడో బంగారం నిల్వను జియాలజిస్ట్‌లు అధికారికంగా నిర్ధారించారు. సుమారు 3 కిలోమీటర్ల పొడవున ఈ బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

బన్స్వారా “చిన్న కాశీ”గా పేరుపొందినదేకాక “బ్లాక్ గోల్డ్” అయిన బొగ్గు, విలువైన ఖనిజాల నిలయంగా పేరు పొందింది. ఇప్పుడు “యెల్లో గోల్డ్” అయిన బంగారం కూడా ఇక్కడ భారీగా లభిస్తుండటంతో బన్స్వారా ఆర్థికపరంగా ఒక గేమ్‌చేంజర్‌ ప్రాంతంగా మారబోతుందని నిపుణుల అంచనా.

ఇప్పటికే ఇక్కడ రెండు బంగారపు నిల్వలు గుర్తించబడగా, ఇప్పుడు కన్కరియా ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన మూడో నిల్వ రాజస్థాన్ ప్రభుత్వానికి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. కేంద్ర గనుల పరిశోధనా సంస్థ (GSI) నిర్వహించిన భూగర్భ సర్వేలో ఈ బంగారం పొరలు ప్రీమియం గ్రేడ్ నాణ్యత కలిగినవిగా ఉన్నట్లు తెలిపారు. అంటే తవ్వకాలు జరిపేందుకు, వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

బన్స్వారా జిల్లాలో గిరిజన సమాజం అధికంగా ఉన్నందున, ఈ బంగారం తవ్వకాల ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలిగించే అవకాశం ఉంది. అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీయవచ్చు. స్థానికంగా రహదారులు, విద్యుత్‌ సరఫరా, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కొత్త బంగారం నిల్వతో రాజస్థాన్ భవిష్యత్తు ఖనిజరంగంలో మరింత బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి విలువైన ప్రకృతి సంపద కనిపిస్తుండటంతో భారతదేశం స్వదేశీ బంగారం ఉత్పత్తిలో మరింత స్వయం సమృద్ధి వైపు సాగుతుందని విశేషంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *