ఈ వారం తెలుగు బాక్సాఫీస్ పరిస్థితి కొంచెం మాములుగా మారింది. బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ హిట్ అవ్వగా, రవితేజ నటించిన మాస్ జాతర ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది.

హైదరాబాద్లోని కొన్ని మల్టీప్లెక్సులు మినహా, ప్రేక్షకుల రాక తక్కువగానే ఉంది. ట్రేడ్ వర్గాల ప్రకారం, బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ మొదటి వీకెండ్ లోనే సాధ్యమైనంత కలెక్షన్ రాబట్టిందని, మాస్ జాతర మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కూలిపోయిందని చెబుతున్నారు.

ఇప్పుడు అందరి చూపు ఈ శుక్రవారం, నవంబర్ 7న రిలీజ్ అవబోయే కొత్త సినిమాలపైనే ఉంది. వాటిలో ఎక్కువగా యూత్ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మంధాన క్రేజ్ తో ఈ సినిమా పైన అంచనాలు పెరిగాయి. భిన్నమైన ప్రేమకథగా ప్రచారం పొందుతున్న ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

సుధీర్ బాబు నటించిన జటాధర మరో కీలక రిలీజ్. ప్రీ రిలీజ్ బజ్ అంతగా లేకపోయినా, సినిమా టీమ్ మాత్రం పాజిటివ్ రివ్యూలు, టాక్ మీద విశ్వాసం ఉంచింది. ఫ్యాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా మిరాయ్లా సర్ప్రైజ్ హిట్ అవుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఇక థిరువీర్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో’ మాత్రం తగినంత ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల స్పందనపైనే ఆధారపడబోతోంది. అలాగే, విశ్ణు విశాల్ నటించిన తమిళ డబ్ మూవీ ఆర్యన్ ఈ వారం రిలీజ్ అవుతోంది. తమిళంలో వారం క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా సగటు రివ్యూలు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కోసం విశ్ణు విశాల్ స్వయంగా హైదరాబాద్లో ప్రమోషన్లు చేస్తూ హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇవేకాకుండా ప్రేమిస్తున్నా, కృష్ణ లీలా వంటి చిన్న సినిమాలు కూడా ఈ వారాంతంలో థియేటర్లలో పరీక్షించుకోబోతున్నాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ నటించిన హాక్ సినిమా కూడా పాన్ ఇండియన్ అట్రాక్షన్ గా జాబితాలో చేరింది.
మొత్తం మీద, ఈ వీకెండ్ రిలీజ్ అవబోయే సినిమాలే ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ కు కొత్త ఊపు ఇవ్వగలవా అన్నది అందరి దృష్టి కేంద్రంగా మారింది.