Native Async

సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కడదాం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Calls for Strong Support, Safety and Recognition for Grassroot Innovators in Andhra Pradesh
Spread the love

•గుర్తింపు, భద్రత, ప్రోత్సాహంపై దృష్టి
•కొత్త ఆవిష్కరణలను గుర్తించిన వెంటనే పేటెంట్
•స్టార్టప్ లకు ప్రోత్సాహం, పారిశ్రామిక అనుసంధానం ముఖ్యం
•రక్షణకు భరోసా ఇస్తే సమాజం నుంచి కొత్తతరం ఆవిష్కర్తలు బయటికి వస్తారు
•శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహం, నిధులు సమకూర్చడం కీలకాంశం
•గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యానికి కృషి
•శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

గ్రామ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు, భద్రత, ప్రోత్సాహం అనే అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలను గుర్తించి తక్షణం పేటెంట్ హక్కు కల్పించడంతోపాటు వారి ఎదుగుదలకు కావాల్సిన ప్రోత్సాహం అందించగలిగితే గ్రామ స్థాయి నుంచి కొత్త తరం ఆవిష్కర్తలను బయటకు తీసుకురావచ్చని తెలిపారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియాలో మనవంతు భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

మంగళవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు. రాజమండ్రిలోని స్వామి జ్ఞానంద ప్రాంతీయ సైన్స్ సెంటర్ కార్యకలాపాలపై సమీక్షించారు. నూతన ఆవిష్కర్తల అన్వేషణ, ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆలోచనలను గుర్తించడం, ప్రోత్సాహం అందించడం, వాటిని సాకారం చేసుకుని మార్కెట్ కి చేరేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం కీలకం. స్టార్టప్ లతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, గ్రామ స్థాయిలో నూతన ఆవిష్కరణలను గుర్తించాలి. విశ్వ విద్యాలయం స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు ఎంతో మంది సరికొత్త ఆవిష్కరణలతో తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. అలాంటి వారిని గుర్తించి బయటకు తీసుకురావాలి. సరికొత్త ఆలోచనలను గుర్తించి ప్రోత్సాహం అందించాలి.

వారిని పారిశ్రామికవేత్తలతో, ఐటీ స్టార్టప్ లు, ఎన్.ఆర్.ఐ.లు, విశ్వవిద్యాలయం స్థాయి పరిశోధకులతో అనుసంధానం చేయాలి. వారి ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు రక్షణ కల్పించడం ముఖ్యం. అందుకోసం గుర్తింపు పొందిన ఆవిష్కరణలపై అధ్యయనం ప్రక్రియ పూర్తయిన వెంటనే భద్రత కల్పిస్తూ పేటెంట్ రైట్స్ ఇప్పించాలి. ఇప్పటి వరకు ఈ తరహా ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందినా ఓ వేదికపై బహుమతులు అందించడం వద్దే ఆగిపోతున్నాయి.

నూతన ఆవిష్కరణలకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యం:
సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారిని గుర్తించి వారిని విపణికి పరిచయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అవసరం అయితే ఎంఎస్ఎంఈ పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం. మన అవసరాలకు తగిన విధంగా మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదం వెనుక ఉన్న లక్ష్యం అదే. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించుకోగలిగితే అది మన ఆర్ధిక వ్యవస్థకు చోదక శక్తి అవుతుంది. 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దేందుకు దోహద పడుతుంది.

మన అవసరాలు మనమే తీర్చుకునే ఆలోచనలకు ప్రోత్సాహం:
ఒక గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎలాంటి సాంకేతికత అవసరమో ఆ దిశగా ఆలోచనలు చేసే వారిని ప్రోత్సహిద్దాం. కనీస సౌకర్యాలు లేని కుటుంబంలో పుట్టిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఆయన స్ఫూర్తితో సరికొత్త ఆవిష్కరణలు చేసే యువతకు రాష్ట్రంలో కొదవ లేదు. రాజమండ్రి ప్రాంతీయ సైన్స్ సెంటర్ కి వెళ్లిన సందర్భంలో అక్కడ విద్యార్ధులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తగ్గించాలన్న ఆలోచనతో రూపొందించిన కొన్ని ఆవిష్కరణలు నన్ను ఆకర్షించాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అద్బుతాలు సృష్టిస్తారు. అది భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, మరేదైనా కావచ్చు మన అవసరాలకు తగిన విధంగా ఆవిష్కరణలు ఉండేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలి. ఆవిష్కరణలకు విద్యార్హత కొలమానం కాదు. వయోబేధాలు, ప్రాంతీయ బేధాలతో సంబంధం లేదు.
ఉదాహరణకు నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన శివ అనే ఓ చెంచు యువకుడు తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం జరుగుతున్న అన్వేషణను నా దృష్టికి తీసుకు వచ్చాడు. తమ ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించాడు.

యురేనియం బారి నుంచి తమ గ్రామాన్ని ఎలా కాపాడాలో తెలిపి సహాయం కోరాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం దాన్ని ఆపగలిగాం. తీర ప్రాంతాల్లో నివశించే మత్స్యకార యువతలో వలలు, వేట సామాగ్రి తయారీలో అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యానికి సాంకేతికత జోడిస్తే వేటను సులభతరం చేసే అద్భుత ఆవిష్కరణ బయటకు వస్తుంది. అందుకు మనమంతా చేయాల్సిన ముఖ్యమైన పని సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు గుర్తించడమే. అధ్యయనం తర్వాత ఆ ఆవిష్కరణలు విపణికి చేరేందుకు సహకారం అందించాలి. పారిశ్రామికవేత్తలు, ఎన్.ఆర్.ఐ.లు, ఆలోచనలకు మరింత పదును పెట్టేందుకు విశ్వవిద్యాలయం స్థాయి ప్రొఫెసర్లతో కలిపి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. నూతన సంవత్సరం.. నూతన ఆవిష్కరణలతో మన రాష్ట్ర యువత మేధస్సుని వెలుగులోకి తీసుకురావాలి” అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్ గారు, ఆప్ కాస్ట్ సీఈఓ, మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit