బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వెండి ధరలు విపరీతంగా ఎగబాకడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఈరోజు ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 పెరగడం, మొత్తం ధర రూ.2 లక్షలు దాటడం విశేషంగా మారింది. నవంబర్ 25 నుంచి వెండి ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను పునరాలోచిస్తున్నారు.
బంగారం ధరలు ఇప్పటికే అధికంగా ఉండటంతో, చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయంగా వెండిని కొనుగోలు చేస్తుంటారు. ఈ డిమాండ్ ఆకస్మికంగా పెరగడం వెండి రేట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఒక సంవత్సరం క్రితం కిలో వెండి 70 వేల రూపాయల పరిధిలో ఉండగా, ప్రస్తుతం రెండింతలు కాదు, దాదాపు మూడింతల దగ్గరికి చేరుకోవడంతో సామాన్యులకు వెండి ఆభరణాలు అందుబాటులో ఉండకపోచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, పెట్టుబడి దారులు కూడా వెండిని సురక్షిత పెట్టుబడిగా భావించి భారీగా కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి డిమాండ్ పెరగడం, పరిశ్రమలలో వినియోగం అధికమవడం, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కూడా ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి. రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేయడంతో, వ్యాపారులు పెద్దఎత్తున నిల్వ చేస్తుండటం కూడా ధరల ఎగబాకుడుకు దారితీస్తోంది.