మట్టిలోనే మాణిక్యాలుంటాయి. వాటిని గుర్తించి బయటకు తీసి సానబెట్టినపుడు అవి పదిమందికి ఉపయోగపడతాయి. మరో పదిమందికి ఇన్పిరేషన్‌గా నిలుస్తాయి. ఒక మనిషి సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగం కావాలి. మంచి సంపాదన, కుటుంబం ఉండాలి. కుటుంబంలో ప్రోత్సహించేవారు ఉండాలి. ప్రోత్సహించేవారు ఉంటే చాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఒకటికాదు రెండు కాదు…ఈ మాణిక్యం జోత్స్న మాదిరిగా మూడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చాలు దేవుడా అని ఎంతోమంది ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో కష్టపడితే మూడు నాలుగు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పకనే చెప్పింది జోత్స్న.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మూడు ఉద్యోగాలకు అర్హత పొందింది జోగుళాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఎం జోత్స్న. మొదట గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల కాగా, ఆ ఫలితాల్లో జోత్స్న ఉత్తీర్ణత సాధించి బీసీ వెల్‌ఫేర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ తరువాత గ్రూప్ 3, గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేశారు. ఈ రెండు గ్రూప్స్ ఫలితాల్లోనూ జోత్స్న ఉత్తీర్ణత సాధించింది. పంచాయితీరాజ్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించింది.
ఇంత సాధించిన జోత్స్న జీవితం మొదటి నుంచి ఘనమైనదేమి కాదు. అంథకారం నుంచి తన జీవితం మొదలైంది. 2017లో తల్లిదండ్రులు ఓ రోడ్డుప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి తన అమ్మమ్మ వద్దనే ఉంటూ చదువుకున్నది. చదువు మాత్రమే తన జీవితాన్ని మార్చగలదు అని నమ్మిన జోత్స్న ఇంటర్‌లో కష్టపడి చదివి 970 మార్కులు తెచ్చుకుంది. ఆ తరువాత ఓపెన్ కేటగిరీలో డిగ్రీ చేసిన జోత్స్న వివాహం తరువాత భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం కోసం కష్టపడటం మొదలుపెట్టింది. చంటిబిడ్డను దూరంగా ఉంచి మాతృబాధను అనుభవిస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. దాని ఫలితమే గ్రూప్స్‌లో విజయం.