మాఘమాసం వచ్చిందంటే భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. అదే మాసంలో వచ్చే శుక్ల చతుర్థి రోజు వినాయక జయంతి జరుపుకోవడం మరింత విశేషం. ఈ ఏడాది 2026 జనవరి 22న మాఘ శుక్ల చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో గణనాథుడి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. భాద్రపద మాసంలో జరుపుకునే వినాయక చవితికి భిన్నంగా, మాఘ మాసంలో వచ్చే ఈ చతుర్థిని గణేష్ జయంతి, తిల్కుంద్ చతుర్థి, వరద్ చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు.
పురాణాల ప్రకారం ఈ రోజునే గణపతి అవతరించాడని విశ్వాసం. అందుకే ఈ తిథికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. వినాయక చవితి రోజున మాదిరిగానే, మాఘ శుక్ల చతుర్థి రోజున కూడా చంద్రదర్శనం చేయకూడదన్న ఆచారం ఉంది. పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే అపవాదులు, నిందలు ఎదురయ్యే అవకాశం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ దోష నివారణకు నారద మహర్షి సూచించిన మంత్ర జపం చేయాలని పండితులు సూచిస్తారు. “సింహః ప్రసేనామవధీత్…” అనే శ్లోకాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే ఉపశమనం కలుగుతుందన్న నమ్మకం ఉంది.
ఈ రోజు తెల్లవారుజామునే నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని, నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం పసుపు, సిందూరం లేదా ఆవుపేడతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజిస్తారు. నువ్వులతో చేసిన లడ్డూలు, ఉండ్రాళ్లు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. పూజ అనంతరం వాటిని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుంటారు.
వినాయక జయంతి రోజున ఉపవాసం పాటించడం ఎంతో పుణ్యఫలదాయకమని పురాణాలు చెబుతున్నాయి. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి, నాలుగో రోజు గణేశుడిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులు ఈ రోజున నియమ నిష్టలతో గణపతి పూజ చేస్తే కోరిన ఫలితం లభిస్తుందన్న విశ్వాసం భక్తుల్లో బలంగా ఉంది. భక్తి, నియమం, విశ్వాసం కలిసిన ఈ గణేష్ జయంతి… మనసుకు ప్రశాంతతను, జీవితానికి శుభారంభాన్ని ఇస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.