తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 28,976 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శుక్రవారం రోజున హుండీ ద్వారా స్వామివారికి రూ. 2.60 కోట్ల ఆదాయం లభించింది.
ఇక స్వామికి అత్యంత ఇష్టమైన శనివారం రోజున కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సులు భక్తులతో నిండిపోయి గోగర్భం డ్యామ్ వరకు భక్తులు లైన్లో ఉన్నట్టుగా సమాచారం. ఇక స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. టోకెన్ తీసుకున్న సర్వదర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్టుగా సమాచారం. రూ. 300 శీఘ్రదర్శనం భక్తులకు దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోంది.