మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రోజును సూర్యభగవానుడు రథం ఎక్కి దిశ మార్పు చేసుకున్న రోజు అని భక్తులు విశ్వసిస్తారు. 2026లో ఇది జనవరి 25వ తేదీ ఆదివారం కి పడుతోంది. సూర్యుడి ఆరాధనకు అత్యంత విశిష్టమైన ఈ తిథి, సూర్యరాశి శక్తిని బలపరిచే రోజు కూడా. భక్తులు ఈ రోజు సూర్యుడికి పాలు, నైవేద్య పాయసాన్ని సమర్పించడం, సూర్య నమస్కారం చేయడం, సూర్య మంత్రాలు పఠించడం వంటి పూజా క్రతువులు పాటిస్తారు.
పిల్లల ఆరోగ్యం కోసం రథసప్తమి రోజు చేసే ప్రత్యేక నియమాలు ఉన్నాయన్న విశేషం. ఈ రోజు ఉదయం అరుణోదయ సమయం, అంటే సూర్యోదయం సుమారు 1.30 గంటల ముందు, చిన్న పిల్లలకు స్నానం చేయించడం అత్యంత శుభప్రదం. స్నాన సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, జిల్లేడు ఆకులు (అర్క పత్రాలు) తల, భుజాలు, ఛాతీ, మోచేతులు, మోకాళ్లు, అరచేతుల్లో మొత్తం 7 ఆకులను ఉంచి స్నానం చేయించడం సంప్రదాయం. స్నానం అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం, సూర్య మంత్రాలను పఠించడం శ్రేయస్కరంగా భావిస్తారు.
ఈ ఆచారాలను పాటించడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, దీర్ఘాయుష్సు, శ్రేయస్సు, సిరిసంపదలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు పొరపాటుగా ఉప్పు తినకూడదు; అలాగే ఉప్పు దానం చేయడం మహాపవిత్రంగా పరిగణించబడుతుంది. నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే, కుటుంబ సుఖసంతోషం, వైవాహిక శాంతి నిలుస్తుందనే నమ్మకం ఉంది. బెల్లం, ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్కరం.
రథసప్తమి ఉత్సవం చిన్న చిన్న పరిహారాలతో, భక్తి, నియమం, విశ్వాసంతో పాటిస్తే పిల్లల ఆరోగ్యం, జీవిత పథం, కుటుంబ శాంతి అన్నీ బలపడతాయని భక్తులు నమ్మకంగా భావిస్తున్నారు.