తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంత విశాలమైన శ్రీవారి కన్నులు పూర్తిగా ఎందుకు కనిపించవు? ఆ కళ్లపై ఉన్న భారీ తిరునామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?
పురాణాలు, సంప్రదాయాల ప్రకారం వేంకటేశ్వర స్వామి విగ్రహం సాధారణ శిల కాదు. అది శక్తి సమూహం. స్వామివారి కళ్ల నుంచి అపారమైన దివ్యశక్తి కిరణాలు ప్రసరిస్తాయని పండితులు విశ్వసిస్తారు. ఆ శక్తిని సాధారణ మానవులు నేరుగా తట్టుకోలేరనే భావనతోనే శ్రీవారి కన్నులపై తెల్లటి తిరునామం విస్తారంగా ఉంచుతారు. అలా నామం స్వామివారి చూపును కొంతమేర కప్పి, భక్తులపై పడే శక్తి తీవ్రతను నియంత్రిస్తుందని నమ్మకం.
స్వామివారి పాదాల నుంచి నిరంతరం ప్రవహించే విరజానది, విగ్రహం నుంచి వెలువడే తాపం వంటి అద్భుతాలు కూడా ఆయనలోని అపార శక్తికి నిదర్శనాలుగా చెబుతారు. అందుకే రోజూ దర్శనంలో స్వామివారి కన్నులు సగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తాయి.
అయితే ప్రతి గురువారం మాత్రం ఒక విశేషం ఉంటుంది. ఆ రోజు ఉదయం శ్రీవారి ఆభరణాలను తొలగించి, తిరునామాన్ని చిన్నగా వేస్తారు. అప్పుడు భక్తులు స్వామివారి దివ్య నేత్రాలను స్పష్టంగా దర్శించగలుగుతారు. గురువారం జరిగే తిరుప్పావై సేవ, అన్నకూటోత్సవం సమయంలో ఆ కళ్లను దర్శించడం అపార పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.
అందుకే తిరుమలలో శ్రీవారి నామం కేవలం అలంకారం కాదు… అది దైవశక్తిని కాపాడే ఆధ్యాత్మిక కవచం.