సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం పెరుగుతున్న ఈ కాలంలో సెలబ్రిటీల ఐడెంటిటీ మిస్ యూజ్ కి గురవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పేరు, ఇమేజ్, గుర్తింపును డిజిటల్ వేదికలపై జరుగుతున్న దుర్వినియోగం నుంచి కాపాడాలని కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), పబ్లిసిటీ హక్కులకు (Publicity Rights) చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, గుర్తింపులను అనుమతి లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫాంలు, వాణిజ్య కార్యకలాపాల్లో విస్తృతంగా వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌ను గుర్తించిన కోర్టు, “NTR”, “Tarak”, “Jr. NTR”, “NTR Jr.”, “Nandamuri Taraka Rama Rao Jr.” వంటి పేర్లు, అలాగే “Man of Masses”, “Young Tiger” వంటి బిరుదులు పూర్తిగా ఆయనకే ప్రత్యేకమైనవని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ గుర్తింపులను వాడితే, చట్టప్రకారం వెంటనే తొలగించాలని ఆదేశించింది.
ఇంకా, గుర్తు తెలియని లేదా అనామక వ్యక్తులు కూడా ఎన్టీఆర్ గుర్తింపును దుర్వినియోగం చేయకుండా కోర్టు ఆంక్షలు విధించింది. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా పేరు లేదా రూపాన్ని వాడితే, అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.