యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చే వార్త వెలువడింది. సెప్టెంబర్ 19న ఆయన ఒక అడ్వర్టైజ్‌మెంట్ షూట్‌లో పాల్గొంటున్న సమయంలో స్వల్ప గాయానికి గురయ్యారు. ఈ వార్త బయటకు రాగానే అభిమానుల గుండెల్లో ఆందోళన మొదలైంది. “ఏమైంది? అనే ప్రశ్నలతో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే వెంటనే ఎన్టీఆర్ టీమ్ స్పందించి, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. చిన్నపాటి గాయమేనని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
డాక్టర్లు ఎన్టీఆర్‌కి రెండు వారాల పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అభిమానులు, మీడియా ఎవ్వరూ అవసరం లేని ఊహాగానాలు చేయవద్దని టీమ్ విజ్ఞప్తి చేసింది. “తారక్ బాగానే ఉన్నారు, త్వరలోనే మళ్లీ మామూలు ఉత్సాహంతో పనిలోకి వస్తారు” అని భరోసా ఇచ్చారు.

ఇక ఈ గాయం పెద్దదేమీ కాకపోవడం అభిమానులకు ఊరట కలిగించింది. “మన తారక్ బాగానే ఉన్నాడు, కాస్త విశ్రాంతి తీసుకుని మరింత ఎనర్జీతో మళ్లీ సెట్‌లోకి వస్తాడు” అని అభిమానులు సంతోషపడుతున్నారు. సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ తారక్’ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.