లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) సినిమాలపై బిజీగా ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాపై స్పష్టత ఇచ్చారు. LCUని పక్కన పెట్టి బన్నీతో సినిమా చేయడానికి ఎందుకు సిద్ధమయ్యారన్న ప్రశ్నకు ఆయన చాలా ఓపెన్‌గా సమాధానం చెప్పారు.
లోకేశ్ మాట్లాడుతూ… మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు అల్లు అర్జున్‌తో తనకు చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగానే ఈ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందని తెలిపారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగాయని చెప్పారు. అందుకే LCU సినిమాలకంటే ముందుగా బన్నీ సినిమా చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
అలాగే తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యాక ఖైదీ–2, విక్రమ్–2, రోలెక్స్ వంటి భారీ సినిమాలు లైనప్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమాలన్నీ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించేలా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇటీవల ఖైదీ–2 నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై కూడా లోకేశ్ స్పందించారు. రెమ్యునరేషన్ కారణంగానే ఖైదీ–2 నుంచి తప్పుకున్నానన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవ వార్తలేనని, తాను ఇప్పటికీ LCU పట్ల పూర్తిగా కమిటెడ్‌గా ఉన్నానని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో బన్నీ–లోకేశ్ కాంబినేషన్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఒకవైపు అల్లు అర్జున్ స్టార్ పవర్, మరోవైపు లోకేశ్ కనగరాజ్ స్టైలిష్ మేకింగ్… ఈ కలయిక ఇండియన్ సినిమా స్థాయిలో పెద్ద సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి.