తమిళ సినీ ప్రపంచం లో ఒక మెగా collaboration చూడబోతున్నాం. ఇద్దరు మహానటులు — రజనీకాంత్ ఇంకా కమల్ హాసన్ — ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. కానీ ఈసారి నటులుగా కాదు… నిర్మాత ఇంకా హీరోలుగా!
కమల్ హాసన్ తన ప్రతిష్టాత్మక బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ద్వారా రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి. ఈ చిత్రం తాత్కాలికంగా #Thalaivar173 అనే పేరుతో ప్రకటించబడింది.
2025 నవంబర్ 5న ఈ భారీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. రజనీకాంత్ ఇంకా సుందర్ సి కలయికకు ఇది 28 ఏళ్ల తర్వాతి చిత్రం — 1997లో వచ్చిన అరుణాచలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తోంది.
అధికారిక పోస్టర్‌పై “Kamal Haasan presents Superstar Rajinikanth in a film by Sundar C” అని రాసి ఉండటం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇది కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాదు, ఇద్దరు సినీ తారల మధ్య ఉన్న గౌరవం, స్నేహబంధానికి ఒక గుర్తు కూడా. ఈ సందర్భంగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ తన 44వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని పొంగల్ 2027 సందర్భంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా, వీరిద్దరూ కలిసి నటించే మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా త్వరలో రానుందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్‌ను ధృవీకరించినప్పటికీ, దర్శకుడి పేరు ఇంకా ఖరారు కాలేదు. కొందరు ప్రముఖ దర్శకులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
కమల్ హాసన్ ఈ సందర్భం గా ట్విట్టర్ లో తమిళంలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు. రజనీకాంత్‌తో తన సినీ ప్రయాణం, స్నేహం, పరస్పర గౌరవం గురించి హృదయపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 పూర్తి చేసిన వెంటనే #Thalaivar173 షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.