ఆంధ్రప్రాంతపు ప్రత్యేకత చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గోంగూర పచ్చడి. పుల్లగా, కారంగా ఉండే ఈ పచ్చడి అన్నం మీద వేస్తే చాలు… విందుభోజనం చేసినంత ఆనందం కలుగుతుంది. గోంగూరలో ఉండే సహజమైన పులుపే ఈ పచ్చడికి ప్రత్యేక రుచి తెస్తుంది. అంతేకాదు, ఈ పచ్చడిని అన్నంతో పాటు దోశ, ఇడ్లీ, చపాతీ, రోటీ, పప్పు వడలు, మురుక్కులు వంటి స్నాక్స్‌తో కూడా తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఈరోజు మనం పసందైన, రుచికరమైన గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
- గోంగూర ఆకులు – 3 కప్పులు
- ఎండు మిరపకాయలు – 10
- పచ్చిమిరపకాయలు – 5
- వెల్లుల్లి రెబ్బలు – 10
- ఆవాలు – 1 టీ స్పూన్
- జీలకర్ర – అర టీ స్పూన్
- మినపప్పు – 1 టీ స్పూన్
- ఉప్పు – తగినంత
- నూనె – 3 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
మొదటగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, గోంగూర ఆకులను వేసి మృదువుగా అయ్యే వరకు వేపాలి. అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టాలి.
తరువాత మరో పాన్‌లో కొంచెం నూనె వేసి, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గోంగూరతో కలిపి మెత్తగా కాకుండా కొద్దిగా ముద్దలా రుబ్బుకోవాలి. ఇప్పుడంటే మిక్సీ, గ్రైండర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిలో వేసి మిక్స్ చేసే కంటే కూడా రోటిలో వేసి చేత్తో రుబ్బుకుంటే చెట్నీకి వచ్చే రుచి వేరు. కాస్త కష్టమైన, రుచికరంగా తినాలి అంటే రోటిలో రుబ్బుకోవడమే మంచిది. చివరగా ఉప్పు తగినంత వేసి కలిపితే రుచికరమైన గోంగూర పచ్చడి సిద్ధం.
రుచి రహస్యం
ఈ పచ్చడి పుల్లదనానికి గోంగూరే కారణం. కారాన్ని ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇస్తాయి. వెల్లుల్లి రుచి, ఆవాలు–జీలకర్ర తాలింపు వాసన అన్నింటిని కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది.
అన్నంలో వేయించి తింటే గోంగూర పచ్చడి స్వర్గానుభూతి కలిగిస్తుంది. అలాగే స్నాక్స్‌తో సైడ్ డిష్‌గా పెట్టుకున్నా రుచిని రెట్టింపు చేస్తుంది.