సీతాఫలం ఎంతో బలం అనే సామెత ఊరికే రాలేదు. ఈ పండులో ఉండే ఔషద గుణాలే ఇందుకు కారణం. ఈ ఫలం మహిళలకు ఓ వరం. శీతాకాలంలో మాత్రమే లభించే ఈ ఫలాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలెట్‌లు రోగనిరోధక వ్యవస్థను జాగృతం చేస్తాయి. ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. తీపి తినాలనే కోరికను తగ్గించి బరువును అదుపులో ఉంచేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి 6 …సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్లను ఉత్పత్తి చేస్తుంది.

మానసిక ఆందోళనలను అదుపులో ఉంచుతుంది. సీతాఫలంలోని క్యాల్షియం వయసు పెరుగుతున్న మహిళల్లో ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో మాత్రమే కాదు… ప్రసవం తరువాత కూడా వారికి శక్తిని అందిస్తూ త్వరగా కోలుకునేలా చేస్తుంది సీతాఫలం. అందుకే పెద్దలు చెబుతుంటారు.. ఏ కాలంలో దొరికే పండును ఆ కాలంలో తప్పకుండా తీసుకోవాలి.