కర్ణాటక నుండి కేరళకు అక్రమంగా తరలిస్తుండగా ₹3.15 కోట్ల భారీ మొత్తంలో నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు . నిఘా వర్గాల సమాచారంలో భాగంగా, సరిహద్దు ప్రాంతంలో వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన అధికారులు, నగదు సహజంగా కనపడకపోవడంతో వాహనాన్ని పూర్తిగా స్కాన్ చేయించారు. అనంతరం కార్ ఫ్లోర్ భాగాన్ని ఎత్తి చూడగా మందపాటి స్టీల్ షీట్లతో వెల్డింగ్ చేసి ప్రత్యేకంగా తయారుచేసిన రహస్య గదులను గుర్తించారు. వాటిలో ప్యాకెట్ల రూపంలో భారీ మొత్తంలో నగదు కట్టలు దాచినట్లు బయటపడింది.
ఈ ఆపరేషన్‌లో వడకర ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరు నగదును కేరళలోని వివిధ వ్యక్తులు, వ్యాపార సముదాయానికి సరఫరా చేసే నెట్‌వర్క్‌లో భాగమని అనుమానం వ్యక్తమైంది. మొత్తం నెట్‌వర్క్‌కు మార్గదర్శకుడిగా సల్మాన్ కందతిల్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడని అధికారులు గుర్తించారు.
ఈ నగదు మూలం, ఉపయోగం, రాజకీయం కోసమా లేదా అండర్‌గ్రౌండ్ ఫండింగ్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. నగదును బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల అనధికార లావాదేవీల కోసం వాడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు సంబంధిత ప్రాంతాల్లో మరిన్ని దాడులు నిర్వహిస్తూ, నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటన కేరళలో అక్రమ డబ్బు రవాణాపై ఉన్న అనుమానాలను మళ్లీ వెలుగులోకి తెచ్చింది.