ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అటవీ పరిసర గ్రామాల్లో అడవి ఏనుగులు చొరబడి చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టేందుకు, మానవ – వన్యప్రాణి సంఘర్షణను నిలువరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించింది. చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన ఎ.ఐ (AI) ఆధారిత వ్యవస్థ, సౌరశక్తి సాయంతో పని చేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వాటిని స్వల్పంగా భయపెట్టి సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఇప్పటికే అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రామాల్లోకి చొరబడిన అడవి ఏనుగులను కుంకీలు విజయవంతంగా, సురక్షితంగా అడవిలోకి మళ్లించాయి.
ఏనుగుల బెడద నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ విధానంతో పని చేసే సరికొత్త వ్యవస్థను ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో మోహరించారు. ఈ వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వాటిని స్వల్పంగా భయపెడతాయి. ఏనుగులను గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులను హెచ్చరిక సంకేతాలు పంపుతాయి. తద్వారా అటు మనుషులు, ఇటు వన్యప్రాణులకు రక్షణ వ్యవస్థలా ఉపయోగపడతాయి.

120° పరిధిలో 60 మీటర్ల మేర సున్నిత ప్రాంతాలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పంటల నష్టాన్ని నివారించడంతోపాటు మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.