భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఫలితమని, ఆ ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములను భూదందాకు ఉపయోగించాలనుకున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి వైఎస్ జగన్ గారు పోరాడటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు కేవలం 2,200 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించాలనే స్పష్టమైన నిర్ణయం తీసుకుని భూసేకరణ, అనుమతులు, న్యాయసంబంధ అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించారని చెప్పారు.
ఆయన కృషివల్లే ఈ రోజు భోగాపురం రన్‌వేపై విమానం ల్యాండ్ కావడం ఉత్తరాంధ్ర ప్రజల గర్వకారణమైందన్నారు. 2019కు ముందు పబ్లిసిటీ కోసం టెంకాయల రాజకీయం చేసిన టీడీపీ ఇప్పుడు అభివృద్ధి క్రెడిట్ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అయితే సోషల్ మీడియా ద్వారా నిజాలు బయటపడటంతో టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. GMR సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2026 లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, ఈ మహత్తర ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారబోతోందని చిన్న శ్రీను స్పష్టం చేశారు.