16/06/2026
Pawan Kalyan Calls for Corporate Participation in Wildlife Conservation During Visakhapatnam Zoo Visit

Pawan Kalyan Calls for Corporate Participation in Wildlife Conservation During Visakhapatnam Zoo Visit

•జంతువుల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలి
•విశాఖ జూ పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు
•తల్లి శ్రీమతి అంజనాదేవి గారి జన్మదినం సందర్భంగా జిరాఫీలు దత్తత
•ఏడాదిపాటు వాటి పోషణ ఖర్చులు భరిస్తానని ప్రకటన
•విశాఖ జూ పార్క్ ఆద్యంతం పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్

పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యవరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు నిచ్చారు. తన తల్లిగారు శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాదిపాటు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరించనున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం విశాఖ జూ పార్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు.

జూ పార్క్ లో జంతువుల సంరక్షణ నిమిత్తం ప్రస్తుతం ఏర్పాటు చేసిన సౌకర్యాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అటవీశాఖ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ అంశంలో జూపార్కులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతులను రక్షిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ జూపార్క్ లో వందలాది వన్యప్రాణులు, పక్షులు ఆహ్లాదకర వాతావరణం మధ్య జీవిస్తున్నాయి. వాటిని సంరక్షణ మనందరి బాధ్యత. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లు భాగస్వాములు కావాలి. తమకు నచ్చిన జంతువును ఎంచుకొని వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. మా కుటుంబం మొత్తం జంతు ప్రేమికులం.

జంతు సంక్షణపై చాలా శ్రద్ధపెడతాం. మా ఇంట్లో నాలుగు కుక్కలను పెంచుతున్నాం” అన్నారు.

•జూ పార్క్ మొత్తం కలియదిరుగుతూ.. జంతువుల వివరాలు తెలుసుకుంటూ:
అంతకు ముందు విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. మొదట జూ వెనుక గేటుకి సమీపంలో ఉన్న సీతాకోక చిలుకల పార్కును సందర్శించారు. పార్కులో ఎన్ని రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి? వలల మధ్య ఉన్న వాటికి ఆహారం ఎలా అందిస్తారు? తదితర వివరాలు జూ క్యూరేటర్ శ్రీమతి మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులు బటర్ ఫ్లై పార్క్ లో వదిలేందుకు సేకరించిన వివిధ రకాల సీతాకోక చిలుకలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్కులోకి విడుదల చేశారు. టైగర్ రకానికి చెందిన సీతాకోక చిలుకలు ఆయనపై దుస్తులపై వాలగా, వాటిని సున్నితంగా పూల మొక్కల పైకి మళ్లించారు. అనంతరం జూ పార్క్ లో ఉన్న నీటి ఏనుగులను పరిశీలించారు. వాటికి ఇచ్చే ఆహారం, జూ అధికారులు వాటికి పెట్టిన పేర్లు, సంరక్షణలో తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read  విజయనగరం ఎస్పీ బంగ్లాకు సంక్రాంతి శోభ

•ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ప్రారంభోత్సవం:
జూలో నూతనంగా ఎలుగుబంట్ల కోసం ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. జూలో ఉన్న రెండు నల్ల ఎలుగుబంట్ల వివరాలు తెలుసుకుని, వాటికి ఆహారం అందించారు. జింకలపార్క్, జూలో ఉన్న సింహాలు, ఆఫ్రికన్ మకావు జాతి చిలుకలు, పులులను తిలకించారు. వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలు, జూలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై చర్చించారు. జూ పార్క్ లోని ఏనుగుల శాలను సందర్శించారు. జూ నిబంధనలు పాటిస్తూ శానిటైజ్ చేసుకుని ఏనుగుల వద్దకు వెళ్లి వాటికి ఆహారం అందించారు. అనంతరం జూ పార్క్ లో ఉన్న జిరాఫీల ఎంక్లోజర్ వద్దకు వెళ్లారు. వాటికి ఎంతో ఇష్టమైన రావి ఆకులు, అరటి పండ్లు ఆహారంగా అందించారు. జిరాఫీలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వాటి వయస్సు ఎంత? తదితర వివరాలు సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు.

•కంబాలకొండ ఎకో పార్క్ లో కెనోపీ వాక్:
జూ పార్క్ సందర్శన అనంతరం కంబాలకొండ ఎకో పార్క్ ని పరిశీలించారు. ఎకో పార్క్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన నగరవనాన్ని ప్రారంభించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరవనాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం వుడెన్ బ్రిడ్జిపై వివిధ రకాల వృక్ష జాతుల మధ్య 400 మీటర్లు కెనోపీ వాక్ చేశారు. ఉడెన్ బ్రిడ్జికి ఇరువైపులా దిడిశ, వేప, ఇప్ప, బిలుడు, మహాగని, ఏగిస, వివిధ జాతుల వెదురు, పనస వృక్షాలను పరిశీలించారు. ఆయా వృక్షాల శాస్త్రీయ నామాలు, వాటి వల్ల ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. ఎకో పార్కులోని శాంతివనంలో మహాగని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, ఏపీసీసీఎఫ్ శ్రీ శాంతిప్రియా పాండే, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రీజనల్ మేనేజర్ శ్రీమతి జ్యోతి, విశాఖ డీఎఫ్ఓ శ్రీ రవీంద్ర దామ, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *