ఎన్నో ఏళ్లు కలిసి పనిచేసిన పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేతలకు బాగా తెలుసు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండి, పార్టీకోసం ఉద్యమాలు చేసి, పార్టీకోసం పోరాటాలు చేసి, పార్టీని జాగృతం చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తే… చివరకు కొన్ని కారణాల వలన పార్టీ నుంచి బయటకు పంపించివేస్తే దానిని తట్టుకోవడం సామాన్యులకే కాదు, నేతలకు కూడా మహాకష్టమే. ఇప్పుడు కవిత విషయంలోనూ అదే జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి పార్టీలో ఉంటూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలను జాగృతం చేసేందకు జనజాగృతి సంస్థను ఏర్పాటు చేసి పోరాటాలు చేసిన కవిత, తెలంగాణ ఆవిర్భావం తరువాత ఒకసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్సీగా సేవలు అందిస్తున్న కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లిక్కర్ స్కామ్ కేసులో కొంతకాలం జైలు జీవితాన్ని గడిపిన కవిత, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత క్రమంగా తన స్వరం మార్చారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత…కవితకు… పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, అధినేత కేసీఆర్ కూడా పార్టీ పనులకు దూరంగా ఉండటం, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కవిత తన స్వరాన్ని పెంచారు. ఇక, ఇటీవలే అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కవిత కాళేశ్వరంపైన, మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పార్టీ సీరియస్ అయింది. అటు ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చ. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి ఎటువైపు అడుగులు వేయబోతున్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ఆరోపణలు తరువాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని, ఇది కవితకు నచ్చక పోవడం చేతనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం లేదా బీజేపీతో పొత్తు విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. 2023 ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీదున్న సమయంలో బీఆర్‌ఎస్ తో పొత్తు లేకున్నా ఆ పార్టీ విజయం కోసం బీజేపీ కొన్ని త్యాగాలు చేసిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి.
కానీ వీటిని ఆ రెండు పార్టీలు దృవీకరించలేదు. కానీ, ఇప్పుడు హటాత్తుగా కవిత సొంత పార్టీపైన, పార్టీ నేతలపైన విమర్శలు చేస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. నాటి లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను అదుపులోకి తీసుకున్నప్పుడు న్యాయం గెలిచిందంటూ బీజేపీ పేర్కొన్నది. కవిత బయటకు రాకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వదంతులు కూడా ఆనాడు వ్యాపించాయి. ఇప్పుడు ఏకంగా బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అన్నది ప్రశ్నార్థకం. లేదా, రాబోయే ఎన్నికల్లో లాభం పొందేందుకే ఈ సస్పెండ్ డ్రామాకు తెరతీశారా అని కూడా పలు అనుమానాలున్నాయి. ఈ అనుమానాలన్నింటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని ఆశిద్దాం.