Native Async

మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

Deputy CM Pawan Kalyan Directs Kakinada Officials to Stay Alert Over Cyclone Montha
Spread the love
  • తుపాన్ కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉంది
  • ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయండి
  • ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి
  • తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి” అని స్పష్టం చేశారు.

ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.

మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రి సిద్ధంకాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *