ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థకు మద్దతు ఇస్తున్న ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని అధికారులు సరిదిద్దారు. ఈ వ్యవస్థ ద్వారా విమానాల ఫ్లైట్ ప్లానింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాంకేతిక లోపం కారణంగా కొంతకాలం పాటు విమానాల షెడ్యూళ్లు ప్రభావితమయ్యాయి.
విమానాశ్రయ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం, కమ్యూనికేషన్ టెక్నికల్ టీమ్స్ అన్నీ కలసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యవస్థను త్వరగా పునరుద్ధరించబడిందని, విమానాల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని తెలిపారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఈ లోపం కొంత ప్రభావం చూపినప్పటికీ, ఇప్పుడు ఫ్లైట్‌ల టేకాఫ్ , ల్యాండింగ్‌లు సవ్యంగా జరుగుతున్నాయి. అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులు హామీ ఇచ్చారు.
ఢిల్లీ విమానాశ్రయ ప్రతినిధులు ప్రకటనలో పేర్కొన్నట్లు – “సాంకేతిక సమస్య తగ్గుముఖం పట్టింది. ఎయిర్‌లైన్‌ల కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయి. ప్రయాణికులు తమ సంబంధిత ఎయిర్‌లైన్‌లను సంప్రదించి తాజా ఫ్లైట్ అప్‌డేట్స్ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.”
విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తాత్కాలికమైనదేనని, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు రాకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.