ఢిల్లీ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని IIT కాన్పూర్ శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో సెస్స్నా విమానం ద్వారా రెండో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించబడిందని ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విమానం మీరట్ వైపు నుంచి ఢిల్లీ గగనతలంలోకి ప్రవేశించి ఖేక్రా, బురారి, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుని క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 8 ఫ్లేర్స్‌ను ఉపయోగించారని, ప్రతి ఫ్లేర్ బరువు సుమారు 2 నుండి 2.5 కిలోల మధ్యగా ఉంటుందన్నారు. వీటిలో ఉన్న రసాయన పదార్థాలను (సోడియం క్లోరైడ్, సిల్వర్ అయొడైడ్ మొదలైనవి) మేఘాల్లోకి విడుదల చేశారు. అప్పుడు ఆ ప్రాంతాల్లోని మేఘాల్లో తేమ శాతం 15-20% మధ్యగా గుర్తించారు. ఫ్లేర్ ఒక్కోటి 2 నుంచి 2.5 నిమిషాల పాటు నిరంతరంగా దహనమై రసాయనాలను విడుదల చేస్తూ, మొత్తం ప్రక్రియ సగటున సగం గంట పాటు సాగింది.
శాస్త్రీయంగా చెప్పాలంటే…. క్లౌడ్ సీడింగ్ అనేది సహజ మేఘాల్లో ఇప్పటికే ఉన్న తేమను ఉత్తేజపరిచి వర్షపు బిందువులుగా మార్చి కృత్రిమంగా వర్షాన్ని సృష్టించే టెక్నాలజీ. దీని ద్వారా తక్షణ వర్షపాతం కురిపించడం లక్ష్యం. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, పొల్యూషన్ వల్ల తేమ ఉన్నపటికీ వర్షం రాకపోవడంతో ఈ అత్యవసర ప్రయోగానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ ప్రయోగం విజయవంతమై అత్యంత ముఖ్యమైన ప్రాథమిక ఫలితాలు కనబడుతున్నాయని, వాతావరణ శాఖ, IIT కాన్పూర్ సంయుక్తంగా రాబోయేరోజుల్లో మూడో ఫేజ్ కోసం కూడా సిద్ధమవుతున్నాయని ఢిల్లీ మంత్రి తెలియజేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో ఢిల్లీలో మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో దట్టమైన పొల్యూషన్ నియంత్రణకు ఇది గేమ్‌చేంజర్ అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.