తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాల తరహాలో, త్వరలో పురుషులకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది అన్నివర్గాలకు చెందిన పురుషులకు వర్తించదు. కేవలం దివ్యాంగులకు మాత్రమే వర్తించనుంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో ‘మహాలక్ష్మి’, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. ఆధార్ కార్డు చూపిస్తే జీరో టికెట్ జారీ చేసి, ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఇక మహిళల కోసం త్వరలో క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రత్యేక కార్డు కూడా ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదే తరహాలో ప్రస్తుతం దివ్యాంగులకు ఉన్న రాయితీ ప్రయాణాన్ని పూర్తిగా ఉచితంగా మార్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు దివ్యాంగులు సగం చార్జీ చెల్లించి ప్రయాణిస్తుండగా, త్వరలో పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రకటించగా, దివ్యాంగుల సంఖ్య, ఆర్థిక భారం వంటి వివరాలను ఏపీఎస్‌ఆర్టీసీ సేకరిస్తోంది.
తెలంగాణలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయమై సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ పథకం అమలులోకి వస్తే మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కనుంది.