లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్బంగా హైదరాబాద్ సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అగ్రగామిగా నిలిచిన ఈ దిగ్గజ ఆటగాడు G.O.A.T టూర్ లో భాగంగా భారత్‌కు రానుండటం దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఉత్సాహం రేపుతోంది. ఈ నెల 13న తెల్లవారుజామున 1:30 గంటలకు కోల్‌కతాకు చేరనున్న మెస్సీ, ఉదయం నుంచే అభిమానులను, ప్రముఖులను కలవడం ప్రారంభిస్తారు. సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరతారు.
హైదరాబాద్ చేరిన మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మెస్సీతో ఫొటో దిగాలనుకునే వారికి అయితే భారీ మొత్తం ఖర్చవుతుంది. ఒక్కో ఫొటోకు రూ. 9.95 లక్షలు + జీఎస్టీగా నిర్ణయించారని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం 100 మందికే పరిమితం చేస్తూ, టికెట్లను డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో పెట్టారు.
తర్వాత సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ప్రత్యేక ఫుట్‌బాల్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఆయనతో పాటు ప్రముఖ ఆటగాళ్లు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా రానున్నారు. అక్కడ సింగరేణి RR–9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య 20 నిమిషాల ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో 15 మంది చిన్నారులకు కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు. చివరి ఐదు నిమిషాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్‌లో పాల్గొననున్నారు. కార్యక్రమం చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు.