ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో ఈ మధ్య కలవరపాటుకు కారణమవుతున్నది వలస పక్షుల వేట. ప్రతి ఏటా విదేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాల నుంచి, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అనేక రకాల పక్షులు ఇక్కడి చేపల చెరువులను ఆశ్రయంగా చేసుకుంటాయి. కొంతకాలం ఇక్కడి వాతావరణంలో గడిపి తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లడం ఈ ప్రాంతానికి సహజమైన దృశ్యం. కానీ ఇప్పుడు ఆ సహజత్వానికే ముప్పు ఏర్పడుతోంది.
చేపల చెరువుల వద్ద కొందరు నిర్వాహకులు “చేప పిల్లలకు నష్టం” అనే సాకుతో వేటగాళ్లను రంగంలోకి దించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒంగోలు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన వేటగాళ్లు నాటు తుపాకులతో పక్షులపైకి కాల్పులు జరుపుతున్నారని చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులు ఒక్కసారిగా నేలకొరిగిపోతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రోజువారీగా వందల సంఖ్యలో వలస పక్షులు, కొంగలు, స్వదేశీ పిట్టలు ఈ అక్రమ వేటకు బలవుతున్నాయని గ్రామస్తుల వాపోతున్నారు. తుపాకుల మోతతో పక్కనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఒకవైపు తిరుపతి జిల్లాలో పక్షుల సంరక్షణకు పండుగలు జరుగుతుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో పక్షుల ప్రాణాలతో చెలగాటం ఆడటం బాధాకరం. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ వేటను అడ్డుకోవాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు.