నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Serve Villages at Least Once a Month: Deputy CM Pawan Kalyan Appeals to Doctors at Rangaraya Medical College
  • పేద ప్రజలకు చికిత్స అందించి… సమాజానికి అండగా నిలవండి
  • వైద్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
  • రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణం
  • ఎంతో మంది వైద్యులను రాష్ట్రానికి అందించింది
  • పూర్వ విద్యార్థుల (రాంకోసా) ఆర్థిక సాయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది
  • కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసి ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి – పవన్ కళ్యాణ్

వైద్యో నారాయణో హరి అంటారు… అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకి పునర్జన్మనిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైద్యులుగా మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. శనివారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ లో పూర్వ విద్యార్థుల సంఘం (రాంకాసా) చేపట్టిన నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…

“కాలం మారుతున్నా రంగరాయ మెడికల్ కళాశాల తన మూలలను ఎప్పుడూ వదల్లేదు. వైద్య విద్యతోపాటు మానవత్వం, సేవాభావం నేర్పే సంప్రదాయం కొనసాగిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది పేద రోగులుకు చికిత్స అందిస్తోంది. ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి మంచి డాక్టర్‌గా మాత్రమే కాదు, మంచి మనిషిగా సమాజంలో నిలిచేలా కృషి చేస్తోంది.

•ఎంతో మంది పెద్దల కృషికి నిదర్శనం ఈ వైద్య కళాశాల:
రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణం. 1958లో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా పని చేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యులను దేశానికి అందిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. ఈ కళాశాల వెనుక ఎంతోమంది పెద్దల కృషి ఉంది. డా. ఎం.వి. కృష్ణారావు గారు, కల్నల్ డా. డి.ఎస్. రాజు గారు కలసి చేసిన ప్రయత్నాల వల్లే ఈ కళాశాల రూపుదిద్దుకుంది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా 100మంది విద్యార్థులతో ఈ కళాశాల ప్రారంభం అయింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాల పిల్లలకు వైద్య విద్య అందిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది.

•కళాశాల పునాదుల్లోనే సేవాగుణం ఉంది:
ఎందరో మహానుభావుల దాతృత్వం, ప్రభుత్వ సహకారంతో ఈ కళాశాల ఏర్పాటు అయ్యింది. భావి తరాలకు ప్రతిభావంతులైన వైద్యులను అందించాలనే సహృదయంతో దాతలు కళాశాలకు పునాదులు వేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదుల్లోనే దాతృత్వం దాగి ఉంది. అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యుల్లో సేవా గుణం కనిపిస్తుంది. ఇక్కడి చదువుకున్న పూర్వ విద్యార్థులు రామ్ కోసా (రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘం) పేరుతో సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాలేజ్ లో చదువుకొని వెళ్లిపోవడం కాదు… కాలేజ్ కు ఏదైనా చేయాలని దృఢ నిశ్చయంతో రూ.10.11 కోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయం. ప్రతి కళాశాల పూర్వ విద్యార్థులు ఇలా ఆలోచిస్తే ఏ కళాశాల ప్రైవేటు పరం కాదు.

కొత్తగా నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. తమకు చదువు చెప్పిన కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్ కోసా సభ్యులందరికీ మనస్పూర్తిగా అభినందనలు. మీ కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకు వెళ్లడం ఖాయం.

  • యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం:
    ఎప్పుడూ యువత భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాము. యువతలో విశాల దృక్పథం రావాలి. కుల, మత, ప్రాంత బేధాల ఆలోచనలు వద్దు. రంగరాయ వైద్య కళాశాల కావచ్చు, భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ కావచ్చు, అనేక విద్యా, వైద్య సంస్థలకు దాతలు పెద్ద మనసుతో దానాలు చేశారు. అవి అందరికీ ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో చేశారు. విశాలంగా ఆలోచించాలి. కొందరు ఇరుకు మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. అలా ఉండవద్దు.

•గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి:
మన దేశంలో సేవలందిస్తున్న వైద్యులకు నాది చిన్న విన్నపం. గ్రామీణ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది. వైద్యులుగా మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నాను. ఇటీవల అరకు ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి మహిళలు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నా వంతుగా, దాతల సహకారంతో అరకులో బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మిస్తున్నాను. మీలో ఉన్న అంకాలజిస్టులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, జనరల్ సర్జన్లు, కార్డియాలజిస్టులు.. ఇలా ఎందరో వైద్య నిపుణులు ఉన్నారు. గ్రామీణులకు సేవలు అందించాలని కోరుతున్నాను. మీరు అందించే ఈ సేవలకు మా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు భరోసాగా ఉంటారు” అన్నారు.

•మొబైల్ డెంటల్ స్ర్కీనింగ్ వాహనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:
నూతన భవనాల శంకుస్థాపన నిమిత్తం రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీఎస్ ఎల్ మెడికల్ కళాశాల, నియో సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ స్క్రీనింగ్ వాహనాలను ప్రారంభించి పరిశీలించారు. వాహనంలో ఉండే అధునాతన సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. ఈ వాహనాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోకవర్గ పరిధిలోని ప్రజలకు ఉచితంగా చికిత్స అందిస్తాయి. వాహనంలో ఉండే అధునాతన డిజిటల్ స్కానర్ లు దంతాల చిత్రాలు, 3డి స్కాన్ లు తీసి సమస్యలను త్వరగా గుర్తించడానికి సహయపడతాయి. మొబైల్ డెంటల్ స్క్రీనింగ్ వాహనాల ప్రారంభం అనంతరం రోగులకు, చిన్నారులకు డెంటల్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, శాసనమండలి సభ్యులు శ్రీమతి కర్రి పద్మశ్రీ, శ్రీ పేరాబత్తుల రాజశేఖరం, శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు, శ్రీ కామినేని శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, ఎస్పీ శ్రీ బిందు మాధవ్, డాక్టర్ గన్ని భాస్కరరావు , రామ్ కోసా అధ్యక్షులు డాక్టర్ ఎంవీవీ ఆనంద్, డాక్టర్ అనూష, రంగారాయ మెడికల్ కాలేజ్ ప్రిస్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, కాకినాడ జీజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *