పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి హృదయపూర్వక అభినందనలు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Congratulates Padma Awardees, Praises PM Modi’s Transparent Selection Process

సామాజిక, శాస్త్ర సాంకేతిక, విద్య, వైద్య, వ్యవసాయ, కళ, సాహిత్య.. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ పురస్కారాల ఎంపికలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ప్రమాణాలు ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని పద్మభూషణ్ ఎంపిక చేయడం ముదావహం. క్యాన్సర్ వ్యాధిపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ప్రముఖ నటులు, విభిన్న పాత్రలలో ఒదిగిపోయే శ్రీ మమ్ముట్టి గారిని పద్మభూషణ్ కి ఎంపిక చేశారు. పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు.

తెలుగు రాష్ట్రాల నుంచి కళ, శాస్త్ర, వైద్య, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రముఖ నటులు, మాజీ ఎంపీ శ్రీ మురళీ మోహన్ గారు, ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఆనందాన్ని కలిగించింది. తెలుగు సినిమాల్లో వారికంటూ ప్రత్యేక స్థానం ఉంది. కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి దీపిక రెడ్డి గారు, బహు భాషా నటుడు శ్రీ ఆర్ మాధవన్ గారు, క్రికెటర్లు శ్రీ రోహిత్ శర్మ గారు, కుమారి హర్మన్ ప్రీత్ కౌర్ గారు, వైద్య నిపుణులు డా.గూడూరు వెంకట రావు గారు, డా.పి విజయానంద రెడ్డి గారు, శాస్త్రవేత్త శ్రీ గడ్డమణుగు చంద్రమౌళి గారు, సంస్కృత, అద్వైత- వేదాంత పండితులు, కవి శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, విద్యావేత్త, యూజీసీ మాజీ ఛైర్మన్ డాక్టర్ మామిడాల జగదీష్ కుమార్ గారు పద్మశ్రీ పురస్కారాలకి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. వారివారి రంగాల్లో విశిష్టమైన సేవలు అందించారు. పద్మ అవార్డులకి ఎంపికైన వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

మరణాంతరం పద్మవిభూషణ్ పురస్కారానికి ప్రముఖ నటులు ధర్మేంద్ర గారు, కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వి ఎస్ అచ్యుతనందన్ గారు, పద్మ భూషణ్ అవార్డుకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారు, పద్మశ్రీ పురస్కారానికి పాడి పరిశ్రమ రంగంలో కృషి చేసిన ఉత్తమ పాడి రైతు మామిడి రమణారెడ్డి గారు, అన్నమాచార్య కీర్తనలు నేటి జన బాహుళ్యానికి చేరువ చేసేందుకు తన వంతు కృషి చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గార్లకు ప్రకటించి వారి సేవలను స్మరించుకునేలా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *