Native Async

మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Urges Full Preparedness for Cyclone Montha in Kakinada District
Spread the love

సమావేశంలో ముఖ్య అంశాలు:

  • ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి
  • ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి
  • తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
  • గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలి
    •పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి
  • పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి
    •మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

మొంథా తుపాను ప్రభావం, ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. రేపు కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలి. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా గర్భిణి స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియపర్చండి. తుపాను పట్ల ప్రజల్లో భయాందోళనలు లేకుండా గ్రామాల్లో మైకుల ద్వారా తుపాను ప్రభావం, తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించాలి. గజ ఈతగాళ్లను తీర ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద సిద్ధంగా ఉంచాలి. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉంది. తక్షణం వాటిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలి.

అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి:
తుపాను ప్రభావం ఉన్న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, వీర్వోలు అందుబాటులో ఉండాలి. పోలీసులు… ముంపు ప్రాంతాల్లో భద్రత చర్యల పర్యవేక్షణ పెంచాలి. పునరావాస కేంద్రాలకు వెళ్లే ప్రజల ఇళ్లకు సైతం భద్రత కల్పించాలి. ప్రజలు ఇళ్లలో లేని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. బలహీనంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటల గట్లను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి. గండ్లు పడితే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలి.

తుపాను తీవ్రత ఉన్నందున మత్స్యకార గ్రామాలను మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం చేయాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. మత్స్యకారుల బోట్లు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కూరగాయలు, నిత్యవసర సరకుల సరఫరాకు అడ్డంకులు లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

కాకినాడ జిల్లాకు రూ. కోటి అత్యవసర నిధి:
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అత్యవసర సాయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 కోట్ల విడుదల చేసింది. అందులో కాకినాడ జిల్లాకు కోటి రూపాయిలు కేటాయించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలడం, దెబ్బ తినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాల”ని దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *