సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సమ ప్రాధాన్యమిస్తూ.. రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.
గత నెలలో ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా మార్గమధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందిన శ్రీమతి నిర్మలమ్మ, శ్రీ సాంబయ్యలు తమ కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది 260 మీటర్ల మేర 8 కొత్త స్తంభాలు వేసి, యుద్ధప్రాతిపదికన వైర్లు లాగి యానాదుల కాలనీలోని నివాస గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పించారు.
15 రోజుల్లోనే శ్రీమతి నిర్మలమ్మ ఇంటితోపాటు కాలనీలోని మిగిలిన గృహాలకు సహా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి విద్యుత్ సదుపాయం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు యానాది కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. యానాది కాలనీవాసుల సమస్యను పరిష్కరించిన జిల్లా అధికారులను, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బందినీ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.