మానవ, ఏనుగుల ఘర్షణ నివారణ, జంతువుల సంరక్షణకు ‘హనుమాన్’

Deputy CM Pawan Kalyan Reviews ‘Hanuman’ Project for Human-Elephant Conflict Prevention and Wildlife Protection
Spread the love
  • హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి
  • ప్రత్యేకమైన కాలపరిమితి, కార్యాచరణ అవసరం
  • రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చూడాలి
  • ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు చేరాలి
  • హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ఆసక్తిగా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్’ (Healing And Nurturing Units for Monitoring, Aid & Nursing of Wildlife) ప్రాజెక్ట్ వివరాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ను అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ కు వివరించారు.

హనుమాన్ ప్రాజెక్ట్ లోని ప్రతి అంశాన్ని ఆసక్తిగా విన్న ఉపముఖ్యమంత్రి ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లడానికి అంశాల వారీగా నిర్దుష్ట కాలపరిమితి అవసరం అన్నారు. జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ ను రూపొందించి మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హనుమాన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే అంశంపై అటవీశాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు నవంబర్ 3వ వారంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మానవులు, జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు బాగుంది. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కాల పరిమితి పెట్టుకోవాలి.

ఏనుగులతో తీవ్రంగా దెబ్బ తింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా? దానికి రైతులు ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ. అలాంటి వాటికి ఏనుగులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయి. ఆ పంటల్లో మార్పులు తీసుకువస్తే రైతుల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి. తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి. ఈ అంశంపై నవంబర్ మూడో వారంలో నిర్వహించే సమీక్షలో కూలంకషంగా చర్చిద్దాము.

  • ప్రత్యేక యాప్ సిద్ధం చేయండి:
    మానవ, వన్య ప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ ప్రజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్ ని సిద్ధం చేయండి. తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువులు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా ఆ యాప్ ఉండాలి. ఏనుగులకి ప్రత్యేక రేడియో కాలర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగులు సమాచారం కూడా తెలిసేలా చూడండి. సాంకేతికతను వినియోగించి ఏ ప్రాంతంలో ఏనుగులకి ఈ రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటే వాటికి ఏర్పాటు చేయాలన్నారు.

  • గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లు:
    హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాల్లో మాదిరి గ్రామాల్లోనూ జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్ప మిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి కు వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్ప మిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

  • ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి అర్జీల స్వీకరణ:
    పలమనేరు పర్యటనకి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కు ప్రజల నుంచి, జనసేన శ్రేణుల నుంచి అర్జీలు వచ్చాయి. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit